ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి విజయవాడకి తరలివచ్చేసి, అక్కడి నుండే పరిపాలన చేస్తున్నారు. ఉద్యోగులు అందరినీ కూడా ఈ ఏడాది జూన్ లోగా తరలిరమ్మని కోరుతున్నారు. విజయవాడ, గుంటూరులో ప్రభుత్వ కార్యాలయాలకు, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, గృహ వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వెలగపూడిలో రూ.180 కోట్ల భారీ వ్యయంతో తాత్కాలిక సచివాలయం కూడా నిర్మిస్తున్నారు.
విజయవాడ తరలివచ్చే ఉద్యోగులకు, వారి పిల్లలకు స్థానిక హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అందుకోసం చట్టసవరణ చేయమని కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ కూడా వ్రాసారు. బహుశః కేంద్రప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించి చట్ట సవరణ చేయవచ్చును. కానీ దేశంలో మేటి నగరాలలో ఒకటిగా నిలుస్తున్న హైదరాబాద్ మెట్రో నగరంలో తమ స్థానికతను వదులుకొని, ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అమరావతికి తరలి వెళ్ళడానికి ఉద్యోగులు కూడా వెనుకాడుతున్నారు. ఈ కారణంగానే ఉద్యోగులు తమ పిల్లల చదువులు, ఉద్యోగావకాశాల విషయంలో కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ విజయవాడకు తరలివచ్చేస్తే తెలంగాణాలో స్థానికత కోల్పోతారు కనుక ఇంకా హైదరాబాద్ లో ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలను కోల్పోతారు.
రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దాదాపు రెండేళ్ళు కావస్తున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయకపోవడంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఆశించినంత వేగంగా జరగడంలేదు. ఆ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడలేదు. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం ఎటువంటి బారీ ఆర్ధిక ప్యాకేజీ మంజూరు చేయకపోవడంతో రాష్ట్రం నేటికీ ఆర్ధిక సమస్యల నుండి బయటపడలేకపోతోంది. రెండేళ్ళు కావస్తున్నా రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలు, భారీ పరిశ్రమలు ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితులలో అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని, అక్కడి స్థానికతను, విద్యాఉద్యోగావకాశాలను, సౌకర్యాలను అన్నిటినీ వదులుకొని అమరావతి రావడానికి ఉద్యోగులు జంకుతున్నారు.
ఉద్యోగులు భయపడుతున్న మరో సమస్య వసతి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు చాలా సౌకర్యవంతమయిన వసతి సౌకర్యాలు బాగానే సమకూర్చిపెట్టింది కానీ ఉద్యోగులకు వసతి కల్పించడం తమ బాద్యత కాదనుకొంది. సుమారు 25,000 మందికి పైగా ఉద్యోగులు విజయవాడ తరలివచ్చి అక్కడ అద్దె ఇళ్ళు చూసుకోవడం ఎంత కష్టమో తేలికగానే ఊహించవచ్చును. ఒకేసారి అంతమంది తరలివస్తే ఇళ్ళ అద్దెలు కూడా పెరిగిపోతాయి. ఆ విషయం స్వయంగా ముఖ్యమంత్రే చెప్పుకొన్నారు కూడా. కనుక హైదరాబాద్ నుండి విజయవాడ తరలిరావాలనుకొన్న ఉద్యోగులకి, వారి కుటుంబాలకి తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.
ఈ నేపధ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపి ఉద్యోగులు ఈ విద్యాసంవత్సరంలో తమ పిల్లలను హైదరాబాద్ లో విద్యాసంస్థలలోనే చేర్పించాలా లేక విజయవాడలో చేర్పించాలా అనే సందిగ్ధంలో పడ్డారు. స్థానికత విషయంలో ఇంతవరకు స్పష్టత రానందున దీనికీ రాష్ట్ర ప్రభుత్వమే తగిన సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ సమస్యలన్నీ చూస్తుంటే ఉద్యోగులు ఎప్పటికయినా విజయవాడ తరలిరావడం సాధ్యమేనా? అని అనుమానం కలుగుతోంది. వారు తరలిరాకపోతే వెలగపూడిలో రూ.180 కోట్ల భారీ వ్యయంతో యుద్దప్రాతిపదికన నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయాన్ని దేనికి వినియోగిస్తారు? అనే సందేహం కలుగుతోంది.