ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘ నేతలు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వాన్ని తెచ్చేది మేమే.. కూల్చేది మేమే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పదమూడు లక్షల మంది ఉద్యోగులున్నారని.. ఒక్కో ఉద్యోగికి ఐదు ఓట్లు ఉన్నాయని బండి శ్రీనివాసరావు అనే ఏపీ ఎన్జీవో నేత లెక్క చెప్పి బెదిరింపులు ప్రారంభించారు. ఇప్పటి వరకూ సార్ సార్ అంటూ ప్రభుత్వ పెద్దల్ని బతిమాలుకున్న ఆయన ఇప్పుడు ఒక్క సారిగా ఇలా మాట్లాడుతూండటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
ఈ బండి శ్రీనివాసరావు అనే పెద్దాయనకు నోటి దురుస చాలా ఎక్కువని ఇటీవల బయటకు వస్తున్న వీడియోలే వెల్లడిస్తున్నాయి. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరిగిన ఓ సమావేశంలో చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసారు. తామే జగన్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్నారు. ఇప్పుడు జగన్ గురించి అలాగే మాట్లాడుతున్నారు. అడ్డంగా మోసం చేసారని అంటున్నారు. నిజంగా మోసం చేసింది ఎవరో ఉద్యోగ సంఘాలు తేల్చుకోవాల్సి ఉంది. ఇటీవల ఆ చేత్తో.. ఈ చేత్తో ఓట్లు వేసి గెలిపించామని ఆయన ప్రకటించి మరో వివాదానికి కారణం అయ్యారు. అంటే దొంగ ఓట్లు వేశారా అనే ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వచ్చాయి. అయినా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం మానుకోలేదు.
ఉద్యోగులు ధర్నాలు.. దీక్షలు మాత్రమే కాదు.. సమ్మె చేసినా వారికి ప్రజల నుంచి మద్దతు లభించదు. ఎందుకంటే ఉద్యోగుల విషయంలో ప్రజలకు ఎలాంటి సానుభూతి లేదు. విపక్షానికీ లేదు. అందుకే ఉద్యోగసంఘ నేతలు తమ చేతిలో ఓట్లున్నాయని.. రాజకీయం ఉందని ఊహించుకుని .. చెలరేగిపోకుండా నేల మీద నడిస్తనే ప్రయోజనం . లేకపోతే .. రెంటికి చెడ్డ రేవడి అవుతారు.