అమ్మో.. ఒకటో తారీఖు..! అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు. వీరిలో ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. మళ్లీ ఒకటో తేదీ దగ్గర పడుతోంది. తమ జీతంలో మళ్లీ అరవై శాతం.. యాభై శాతం ఎక్కడ ప్రభుత్వం కత్తిరిస్తుందోనని ముందుగానే ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ప్రభుత్వానికి లేఖ రాశారు. గత రెండు నెలలుగా నిలిపివేసిన యాభై శాతం జీతంతో పాటు… ఈ నెల మొత్తం జీతం.. ఒకటో తేదీన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రెవిన్యూ ఉద్యోగ సంఘాల నేతగా.. ఆయనకు.. జీతాల చెల్లింపు కోసం బిల్లులు తయారయ్యే సమయం వచ్చింది కాబట్టి.. సమయం చూసుకుని స్పందించినట్లుగా తెలుస్తోంది.
మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలు.. నోరు మెదపడం లేదు కానీ.. బొప్పరాజు డిమాండ్ వినిపించారు కాబట్టి.. వారు కూడా నోరు మెదపక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అనూహ్యంగా.. ఐఏఎస్ వర్గాల నుంచి కూడా.. ఈ డిమాండ్ వినిపిస్తోందని అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరు కూడా ప్రభుత్వంపై పూర్తి జీతాల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల జీతాలకు ఏపీ సర్కార్ అరవై శాతం కోత పెట్టింది. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య ఎప్పుడూ కనిపించని పోటీ ఉంటుంది. ప్రస్తుతం.. ఐపీఎస్ అధికారులకు పూర్తి జీతం వస్తోంది. పోలీసులకు పూర్తి జీతం ఇవ్వాలని జగన్ నిర్ణయించడంతో.. వారికి వేతనాల్లో కోత పడలేదు. కానీ ఐఏఎస్‌లకు మాత్రం అరవై శాతం కోత పడుతోంది. తాము లాక్ డౌన్ అని ఇంట్లో కూర్చోలేదని.. ఐపీఎస్ల్లాగే పని చేస్తున్నామని అయినా తమ జీతాల్లో కోత ఎందుకని.. ఐఎఎస్‌లు ఆగ్రహంతో ఉన్నారు. తమ అసోసియేషన్‌తో నేరుగా సీఎస్‌కు లేఖ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే రెండు నెలల పాటు ఉద్యోగులకు సగం.. సగం జీతం ఇచ్చారు. పరిస్థితులను బట్టి సర్దుకుపోయినా.. ఇక ముందు సాధ్యం కాదని.. పూర్తి జీతం ఇవ్వాల్సిందేనని మెజార్టీ ఉద్యోగులు అభిప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. ఈ నెల నుంచి పూర్తి జీతాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. మద్యం అమ్మకాలు కూడా ప్రారంభవడం.. లాక్ డౌన్ నిబంధనలు సరళీకరించడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి..!