హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు ప్రక్రియ మళ్ళీ వాయిదా పడింది. ఈ నెల 27లోగా అందరూ తప్పనిసరిగా విజయవాడ తరలిరావాలని రాష్ట్ర ప్రభుత్వం క్రిందటి నెలలోనే ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. కానీ అందుకు సిద్దంగాలేని కొందరు ఉద్యోగులు హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ ని కలిసి మాట్లాడారు. వారి చర్చలు ఫలించడంతో ఉద్యోగుల తరలింపు ప్రక్రియని ఆగస్ట్ నెలాఖరు లేదా మరికొంత కాలం వరకు వాయిదా వేస్తున్నట్లు ఎస్.పి.టక్కర్ ప్రకటించారు.
అయితే, ఉద్యోగుల అభ్యంతరాల కారణంగా ఆ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పకుండా తాత్కాలిక సచివాలయ నిర్మాణం జూన్ 27లోగా పూర్తయ్యే అవకాశాలు లేనందునే ఉద్యోగుల తరలింపు ప్రక్రియ మరో రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కానీ ముందు ప్రకటించినట్లుగానే జూన్ 27 నుంచి అమరావతి నుంచే పరిపాలన సాగుతుందని చెప్పారు. తాత్కాలిక సచివాలయం పూర్తిగా సిద్దం అవగానే ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా అక్కడికి తరలిరావలసి ఉంటుందని చెప్పారు. ఈలోగా అందులో వినియోగించుకోవడానికి అవకాశం ఉన్న కార్యాలయాలలో పని చేయడానికి ఉద్యోగులు తరలిరావాలని ఆయన కోరారు. ఉద్యోగులతో మళ్ళీ శనివారం మరోసారి ఆయన సమావేశం కాబోతున్నారు.
ఉద్యోగుల తరలింపు గురించి గత ఏడాదిన్నర కాలంగా చర్చిస్తూనే ఉన్నారు. కానీ ప్రతీసారి ఉద్యోగులు ఏవో అభ్యంతరాలు చెపుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తరలింపు ప్రక్రియ కోసం మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన కమిటీలు వేసింది. గుంటూరు, విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకి భవనాలు వెతికింది. ఒకానొక సమయంలో అమరావతికి సమీపంలో తాత్కాలిక టౌన్ షిప్ నిర్మించాలని కూడా ఆలోచించింది. చివరికి అవేమీ కాదని వందల కోట్లు వెచ్చించి తాత్కాలిక సచివాలయం నిర్మిస్తోంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా అక్కడికి తరలిరమ్మని ఆదేశించడంతో వారు మొండికేస్తున్నారు. తాత్కాలిక సచివాలయం సిద్దం అవుతోంది కానీ అందులో పని చేసేందుకు ఉద్యోగులు సిద్దంగా లేరు. ఈ సమస్య వస్తుందని ముందే ఊహించాము. ఇప్పుడు అదే జరుగుతోంది. దాని వలన అటు ఉద్యోగులకి, ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు, అప్రదిష్ట కలుగుతోంది. ప్రజల దృష్టిలో అందరూ చులకనవుతున్నారు.
ఈ సమస్య తీవ్రతను మొదటే గుర్తించినప్పటికీ, దానిని సరైన పద్దతిలో పరిష్కరించలేకపోవడం వలననే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. అలాగే ఉద్యోగుల మొండిపట్టుదల, గొంతెమ్మ కోర్కెలకు అంతులేకుండా ఉంది. రాష్ట్రం విడిపోయినందున విజయవాడ తరలిపోవాలని తెలిసి ఉన్నప్పటికీ హైదరాబాద్ వదిలిపెట్టి రాబోమని చెపుతుండటం ప్రజలకు కూడా ఆగ్రహం కలిగిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం వందలాది మంది రైతులు తమ జీవనోపాధికి మూలమైన విలువైన తమ పంట భూములను త్యాగాలు చేశారు. కానీ ఉద్యోగులు మాత్రం చిన్న కష్టం కూడా భరించడానికి సిద్దంగా లేరు. వారితో ప్రభుత్వం ఎంత రాజీ పడుతున్నప్పటికీ వాళ్ళు మాత్రం విజయవాడ వచ్చి పనిచేయడానికి ససేమిరా అంటున్నారు. ఇదే వైఖరి కొనసాగితే మున్ముందు ప్రభుత్వానికి వారికీ ఘర్షణ తప్పకపోవచ్చు. అది ఎవరికీ మంచిది కాదు. కనుక ఉద్యోగులు కూడా విజయవాడ తరలిరావడానికి గట్టిగా ప్రయత్నించడం మంచిది.