ఒక్క హోంశాఖ తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మిగిలిన అన్ని శాఖల ఉద్యోగులు, ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం విజయవాడ, గుంటూరులో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయబడిన తమతమ కార్యాలయాలకి చేరుకొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగానే ఈరోజు నుంచే విజయవాడలో లాంఛనంగా పరిపాలన మొదలవుతుంది. ఇటువంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి, ఆర్ధికమంత్రి రామకృష్ణుడు, మంత్రి నారాయణ ఇంకా కొందరు ముఖ్య అధికారులు చైనా పర్యటన పెట్టుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులు తమ కొత్త కార్యాలయాలలో పని మొదలుపెట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను, సహాయ సహకారాలను స్థానిక అధికారులు, సిబ్బంది అందజేస్తున్నారు. ఆర్టీసి, రవాణా, కార్మిక, ఎక్సైజ్, అటవీ, జౌళి, అగ్నిమాపక, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖలు సోమవారం తమతమ కార్యాలయాలలో పూజా కార్యక్రమాలు చేసి లాంచనంగా విధులు నిర్వర్తిస్తాయి. కొన్ని శాఖలలో కొందరు ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వ అనుమతితో ఇంకా హైదరాబాద్ లోనే ఉండి పనిచేస్తున్నారు. మరికొందరు ఈరోజు తమ నూతన కార్యాలయాలలో పూజలు చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోతారని సమాచారం. హైదరాబాద్ కార్యాలయాల నుంచి ఫైళ్ళు, కంప్యూటర్లు, ఫర్నీచర్ వంటివి ఇంకా వస్తూనే ఉన్నాయి కనుక మరొక వారం పదిరోజులు ఈ తరలింపు ప్రక్రియకి, కార్యాలయాలను సర్దుకోవడానికే సరిపోవచ్చు. తాత్కాలిక సచివాలయం పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. ప్రభుత్వంలో చాలా కీలకశాఖ హోంశాఖ నుంచి ఒక్కరు కూడా తరలిరాలేదని సమాచారం. జూలై 15లోగా వారు కూడా విజయవాడ తరలివస్తారని తెలుస్తోంది.
సుమారు రెండేళ్లుగా ఉద్యోగుల తరలింపు గురించి చర్చలు, అధ్యయనాలు, రకరకాల ఆలోచనలు, ప్రతిపాదనలు, అద్దె భవనాల కోసం వెతుకులాటలు వంటివి సాగుతూనే ఉన్నా చివరికి ఎటువంటి ప్రణాళిక ముందస్తు ఏర్పాట్లు లేకుండానే హడావుడిగా తరలింపు జరుగుతోంది. రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ తరలింపు ప్రక్రియకి సరైన ప్రణాళిక సిద్దం చేసుకోలేకపోవడం విడ్డూరంగానే ఉంది. వారి మద్య సరైన అవగాహన లేకపోవడం, పంతాలు పట్టింపులు, మద్యలో అనవసరమైన రాజకీయాలు, ఉద్యోగుల సమస్యలు, కోర్కెలు వంటివి అందుకు కారణంగా కనబడుతున్నాయి. దీని వలన అటు ఉద్యోగులు, ప్రభుత్వం, ప్రజలు అందరూ ఇబ్బందిపడుతున్నారు. పనులు కూడా జరగడం లేదు. ఏమైనప్పటికీ ఏదోవిధంగా ఉద్యోగుల తరలింపు ప్రక్రియ మొదలైంది కనుక బహుశః మరొక రెండు నెలలలోనే విజయవాడ, గుంటూరు, వెలగపూడి నుంచే పూర్తి స్థాయిలో రాష్ట్ర పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించడం ఖాయమైంది.