ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో ఎంత సానుకూలంగా ఉన్నా… అతి చేతకానితంగా ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్న .. ఉద్యోగ సంఘాలు ఇక నిరసనల బాట పట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. అధికారలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దు అని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టారు. కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. సీపీఎస్ సంగతి పక్కన పెడితే.. ఉద్యోగులకు .. గత రెండున్నరేళ్లలో రావాల్సిన ఒక్క ప్రయోజనం దక్కకపోగా… ఇవ్వాల్సినవి కూడా ఆపేశారు. చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పేరుకుపోతోంది.
ఉద్యోగ సంఘం నేతలు ఎంతగా ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటున్న పనులు కావడం లేదని ఉద్యోగుల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఇతర విషయాల సంగతేమో కాని సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు మాత్రం.. పాత పెన్షన్ విధానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. వారంతా ఓ సంఘంగా ఏర్పడ్డాయి.ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా ఏర్పడ్డారు. ఇప్పటి వరకూ ఓపిక పట్టిన వీరు ఇక వెనక్కి తగ్గకూడదని.. నిర్ణయించుకున్నారు. వచ్చే నెల మొదటి నుంచి నిరసనలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. క్విట్ సీపీఎస్ పేరుతో ఉద్యమాలు చేస్తూ పింఛను విద్రోహ దినం-నయవంచన సభలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఉద్యోగులకు నెల జీతాలే సక్రమంగా రావడం లేదు. దీంతో పెండింగ్లో డీఏలు.. పీఆర్సీ గురించి ప్రస్తావించే అవకాశం లేకుండా పోతోంది. ఉద్యోగు సంఘం నేతలెవరూ ప్రభుత్వంతో ఉద్యోగుల సంక్షేమం గురించి ప్రస్తావించే పరిస్థితి లేదు. ఒక్క వెంకట్రామిరెడ్డి అనే సచివాలయ సంఘ నేతకు మాత్రమే తాడేపల్లి వరకూ యాక్సెస్ ఉంటుంది. ఆయన ఉద్యోగుల గురించి తప్ప.. మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూంటారు. దీంతో ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఉంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ ఉద్యోగులు మరంత ధైర్యం తెచ్చుకుంటారు. ప్రభుత్వానికి చిక్కులు ఏర్పడతాయి. ఆ సమయంలో చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు.