ప్రభుత్వ ఉద్యోగం అంటే ఓ భరోసా .. ఎలాంటి పరిస్థితుల్లో అయినా జీతం ఒకటో తేదీన ఠంచన్‌గా వస్తుందన్న నమ్మకం. పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలు ఉంటాయని ఆశ. నిన్నామొన్నటి వరకూ ఇదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా అంతే.. కానీ ఇతర రాష్ట్రాల్లో ఏపీలో కాదు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున స్వచ్చంద పదవీ విరమణ చేస్తున్నారు. ఐదేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ.. తాము రాజీనామా చేస్తామని దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న వారు స్వచ్చంద పదవి విరమణ చేయడానికి అవకాశం ఉంది. ఇలా చేస్తే వారికి పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు లభిస్తాయి. గతంలో ఐదేళ్ల సర్వీస్ ముందుగా వీఆర్ఎస్ తీసుకుని కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించుకునేవారు. ఇప్పుడా అవకాశం లేదు. అయినప్పటికీ ఉద్యోగులు వీఆర్ఎస్ బాట పడుతున్నారు. ముఖ్యంగా ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న వందలాది మంది ఇంజినీర్లు తమకు ఐదేళ్లలోపు సర్వీస్‌లోకి రాగానే వీఆర్ఎస్కు దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఇప్పటికి వంద మందికిపైగా దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది.
విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు తగ్గించాలనే ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమల్లోకి వస్తే ఒక్కో ఉద్యోగి.. రూ. యాభై లక్షల వరకూ పదవీ విరమణ ప్రయోజనాలు పోగొట్టుకుంటారు. అంతేనా పెన్షన్ కూడా సగానికి సగం తగ్గిపోతుంది. వీటన్నింటినీ కాపాడుకోవాలంటే ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కాదని ఉద్యోగంలో కొనసాగితే.. నష్టమే కానీ ప్రయోజనం ఉండదు.
ఇప్పటికే ప్రభుత్వం జీతాలివ్వడానికి కష్టపడుతోంది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉద్యోగుల్ని పట్టి పీడిస్తోంది. జీతాలు వస్తాయో రావోనన్న టెన్షన్ పడే కంటే.. తమ అనుభవంతో ప్రైవేట్ కంపెనీల్లో మంచి పొజిషన్లలో చేరవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఉద్యోగులకు కూడా ప్రభుత్వంపై నమ్మకం పోయింది.