కరోనా కారణంగా ఎన్నికల విధులు నిర్వహించలేమని ఉద్యోగ సంఘాలన్నీతెర మీదకు వచ్చాయి. కొన్ని సంఘాలు… ఎస్ఈసీని దూషిస్తే.. మరికొన్ని సంఘాలు.. చేతులెత్తి వేడుకున్నాయి. ఈ సంఘాల నేతలందరూ… తలా ఒక రసాన్ని పండించారు. నవరసాల్ని మేళవించి.. తమ తమ వాదనలు వినిపించారు. ఏపీ ఎన్జీవో, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవో అమరావతి జేఏసీ, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం, రెవెన్యూ, పోలీస్, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘాలు అన్నీ మీడియా ముందుకు వచ్చి చేసిన ప్రకటలు.. ప్రజల్ని ఔరా అనిపించాయి.
ఏపీలో ఎన్నడూలేని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాజాగా ఉద్యోగ సంఘాలు తెరపైకొచ్చాయి. ఉద్యోగ సంఘాలు పోటీలుపడి మరీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేశాయి. తాము ఎన్నికలు బహిష్కరిస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రకటించింది. ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్తామంటే ఉద్యోగులు సహకరించరని కూడా.. ఈ సంఘాలకు అత్యధికంగా నాయకత్వం వహిస్తున్న రెడ్డి నేతలు చెప్పుకొచ్చారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన ఉద్యోగ సంఘాలు… విధులు నిర్వహించలేమని చెప్పడానికి ప్రెస్మీట్లు పెట్టడం.. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిఅయిన ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని చెప్పడం.. ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది.
ఉద్యోగ సంఘాల నేతల వెనుక ఎవరున్నారో అందరికీ క్లారిటీ ఉంది కానీ.. వారు చెబితే… వీరు ఇలా ప్రకటనలు చేసేస్తారా.. అన్నదే ప్రజల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. కరోనాతో బాధపడిన వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారు. సాధారణ ప్రజలూ చనిపోయారు. ఇప్పుడు ఏపీలో కరోనాపై ఎలాంటి ఆంక్షలు లేవు. అయినా… ఎన్నికల నిర్వహణపై మాత్రం ఉద్యోగులు తిరగబడుతున్నారు. అదే… నిమ్మగడ్డ వైదొలగగానే.. కొత్తగా వచ్చే అధికారి నేతృత్వంలో అయితే కరోనా ఉండదు.. ఏమీ ఉండదు.. ప్రభుత్వం చెప్పినట్లుగా పని చేస్తారు. ఉద్యోగ సంఘాల తీరు… ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది.