ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. సాధారణంగా… వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటే… 31వ తేదీనే ప్రభుత్వాలు జీతాలు చెల్లించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే.. ప్రస్తుతం ఏపీ సర్కార్ ఖాజానాలో జీతాలకు సరిపడా సొమ్ము లేదు. ఉన్నతందా సామాజిక పెన్షన్లకు ఇచ్చేశారు. ఇప్పుడు… ప్రభుత్వం అప్పుల కోసం చూస్తోంది. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల కోసం.. కనీసం రూ.ఆరు వేల కోట్లు కావాలి. ఆర్బీఐ నుంచి ప్రతీ మంగళవారం.. రూ. రెండు వేల కోట్లు బాండ్ల రూపంలో అప్పు తీసుకునే అవకాశం ఉంది. ప్రతీ మంగళవారం అలా తీసుకుంటున్నారు కూడా. నాలుగో తేదీన మంగళవారం మరోసారి రూ. రెండు వేల కోట్లు అప్పు తీసుకోనున్నారు.
దానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయితే.. బుధవారం సాయంత్రానికి… అంటే.. ఐదో తేదీకి ఆ నిధులు రాష్ట్ర ఖాతాకు జమ అవుతాయి. వాటి నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తారు. ఈ లోపు.. పన్నుల వసూలు కొంత మొత్తం వసూలు అవుతుంది. అవి కూడా సరిపోయే అవకాశం లేదు. అందుకే.. ఐదో తేదీకి కూడా… అందరికీ జీతాలు అందే అవకాశం లేదు. సగం మందికి తర్వాత నిధులు సమీకరించుకునే వరకూ పెండింగ్ పడే అవకాశం ఉందంటున్నారు. ఆర్బీఐ వద్ద.. ఏపీ సర్కార్ వాడుకోవడానికి కొన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. వేజ్ అండ్ మీన్స్ పద్దతిలో… ఓవర్ డ్రాఫ్ట్ పద్దతిలోనూ.. ఐదారువేల కోట్లు తీసుకునే అవకాశం ఉంది. వీటిని కూడా ప్రభుత్వం ఉపయోగించుకుంటే.. ఈ నెల ఇబ్బంది ఉండదని అంచనా వేస్తున్నారు.
నిజానికిఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే రూ. 30వేల కోట్లు అప్పు చేశారు. ఆ నిధులన్నీ దండిగా ఉంటాయని… ప్రభుత్వానికి ఇబ్బంది లేదని అనుకున్నారు. కానీ ఆ అప్పుల సొమ్ములేవీ.. ప్రభుత్వం వద్ద లేవని.. తేలిపోయింది. గత నెలలోనూ… రూ. పదివేల కోట్లకుపైగా అప్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారానే అధికంగా అప్పు చేశారని.. ఆఫ్ మార్కెట్ బారోయింగ్ రుణాలు మరింత ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆగస్టు ప్రారంభంలోనూ జీతాలకే.. అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ నెలలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు.. రూ. 18,500 చెల్లించాల్సి ఉంది. అనేక రకాల అర్హతలు చేర్చినా.. వీరు 30 లక్షల మంది వరకూ ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరికి మరో ఆరేడు వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.