ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు.. అధికార వికేంద్రీకరణకు కొత్త అర్థం చెప్పారు. ఇండియన్ సివిల్ సర్వీస్ పాఠాల్లో ఆయన ఏం నేర్చుకున్నారో కానీ… రిటైరయ్యే వరకూ తన సర్వీసులో ఎలాంటి ప్రమాణాలు నెలకొల్పారో కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని న్యాయబద్దమైన పాలన గురించి లెక్చర్లు ఇస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోస్తాంధ్రలో ఉంది కాబట్టి… రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయడం న్యాయబద్ధంగా ఉంటుందని ఆయన తేల్చారు. అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచీలు ఉండాలని సూత్రీకరించారు. లేకపోతే ఆయా ప్రాంతాలకు అన్యాయం చేసినట్లేనని మాట్లాడారు. ప్రజాభిప్రాయాలకు విలువనివ్వాలని తేల్చారు.
జన చైతన్య వేదిక అనే సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎలా అధికార వికేంద్రీకరణ జరగాలన్న అంశంపై హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అసలు ఆంధ్రప్రదేశ్లో అధికారం మొత్తం అమరావతిలో ఉందన్నట్లు వక్తులు తేల్చారు. అసలు సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ అన్నీ ఒక్క చోటే ఉండటం అంత అన్యాయం మరెక్కడా ఉండదని విశ్లేషించారు. మరో మాజీ సీఎస్ కల్లాం అజయ్ రెడ్డి ఈ అధికారాన్ని వికేంద్రీకరించడం వల్లే.. అవినీతి తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు. నిజానికి వీరిద్దరూ నవ్యాంధ్రలో చీఫ్ సెక్రటరీలుగా పని చేసిన వాళ్లే. సివిల్ సర్వీస్ అధికారులుగా పాలనపై, పాలనా విధానాలపై వీరికి ఉన్నంత అవగాహన మరెవరకీ ఉండదేమో..? అయినా సరే… అధికార వికేద్రీకరణ జరగాలంటే… రాజధానిలో కాకుండా.. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఒక్కో ప్రాంతంలో ఉండాలని చెప్పేస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా… రాజధానిలో ఓ చోట అసెంబ్లీ, మరో చోట సచివాలయం…మరో చోట హైకోర్టు ఉన్న దాఖలాలు లేవు. జమ్మూకశ్మీర్లో మాత్రం అక్కడి వాతారవణ పరిస్థితులను బట్టి రాజధాని మారుస్తూంటారు. అయినా సరే.. ఏపీలో మాత్రం ఓ కొత్త వ్యవస్థను తీసుకు రావాల్సిందేనని ఈ మాజి బ్యూరోక్రాట్లు గట్టిగానే పోరాడుతున్నారు. కొద్ది రోజుల్నించి… చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వీరిద్దరూ… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయంలో ఐవైఆర్ కృష్ణారావు మరింత దూకుడుగా ఉంటున్నారు. చంద్రబాబుపై సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు రాయలసీమలో హైకోర్టు వాదనను తెరపైకి తెచ్చారు.