అబద్దం ఆడితే గోడకట్టినట్లుగా కాకపోయినా కనీసం తడిక కట్టినట్లుగా అయినా ఉండాలని పెద్దలు చెబుతూంటారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇలాంటి అబద్దాల్ని నిజం చేయాలనుకున్నప్పుడు శ్లాబ్ వేసినంత పర్ ఫెక్ట్ గా ఉండాలి లేకపోతే పరువు పోతుంది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఇలాంటి విషయాల్లో ఎన్నో సార్లు పరువు పోగొట్టుకుంది.. కొత్తగా పోయేదేమిటిలే అని… తమ్ములపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును తీసేయలేదని… ఫ్యాక్ట్ చెక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
తీసేయకపోవడం ఏమిటి… అసలు ఎక్కడా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య అనే పేరు ఎక్కడా లేదు కదా.. అని అంటే… వారిచ్చే సమాధానం ఏమిటంటే.. బోర్డు తయారీలో ఉందట. ఎప్పటి నుంచంటే.. ఏడాది నుంచి తయారీలో ఉందట. అందుకే బోర్డు పెట్టలేదట. ప్రస్తుతం ఉన్న భవనానికి కళాక్షేత్రం అనే పేరును డిజైన్ చేయించి మరీ పెట్టారు. పక్కన సంగీత పరికరాలు కూడా ఉన్నాయి. కానీ బోర్డు తయారు చేయడానికి సమయం ఉంటుంది కాబట్టి అలా ఏర్పాటు చేశారట.
నమ్మేవాడుంటే.. ఫ్యాక్ట్ చెక్ ఎలాంటి వాటినైనా నమ్మించగలదు. ఈ బోర్డు తీసేసింది గత ప్రభుత్వ హయాంలో అని చెప్పాలని కూడా ఫ్యాక్ట్ చెక్ తాపత్రయ పడింది. గత ప్రభుత్వం యాభై కోట్లు పెట్టి అభివృద్ది చేసింది. ఈ ప్రభుత్వం 2021లో కొన్ని పనులు చేసింది.. ఆ సమయంలోనే బోర్డు తీసేసి.. కళాక్షేత్రం అని పెట్టారు. దాన్ని కవర్ చేసుకోవడానికి బోర్డు తయారీ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దొరికే వరకూ అంతే… దొరికిన తర్వాత తూచ్ అని.. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రకటించడం ఇటీవల ప్రభుత్వానికి కామన్ గా మారిపోయింది.