విజయనగరంలో మహారాజా సర్వజన ఆస్పత్రికి అసలు ఆ పేరే లేనప్పుడు తీసేసిందెక్కడ అని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో వైసీపీకి ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే చెకింగ్ చేసి.. వాస్తవాల్ని కూడా అవాస్తవాలుగా చెప్పే ఈ ట్విట్టర్ హ్యాండిల్.. మహారాజా ఆస్పత్రి పేరు విషయంలోనూ తన విధి తాను నిర్వహించింది. ఆస్పత్రికి అసలు ఎప్పుడూ మహారాజా పేరు లేనే లేదట. దానికి సాక్ష్యంగా .. ఆ ఆస్పత్రిని నిర్మించిన నాటి శిలాఫలకాల ఫోటోలను పెట్టారు. అప్పట్నుంచి ఏ రికార్డుల్లోనూ మహారాజా ఆస్పత్రి అని లేదని.. అందుకే ఇప్పుడూ లేదని అంటున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఏపీ ప్రజలను ఎంత అమాయకులుగా చూస్తుందో ఇంత కంటే సాక్ష్యం మరొకటి అక్కర్లేదమో.
నిన్నటి అర్థరాత్రి వరకూ మహారాజా జిల్లా ఆస్పత్రి అనే బోర్డు ఉండేది. రాత్రికి రాత్రి దాన్ని తొలగించారు. ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే రికార్డుల్లో మహారాజా ఆస్పత్రి అని లేదని.. అందుకే ఆ బోర్డు తీసేసి.. కొత్త బోర్డు పెట్టామన్నట్లుగా ఫ్యాక్ట్ చెక్ పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు కాదు.. ఆ ఆస్పత్రి ప్రారంభించినప్పటి నుంచి ఆ ఆస్పత్రికి మహారాజా ఆస్పత్రి అనే పేరే ఉంది. విజయనగరం జిల్లాతోసంబంధం ఉన్న ఎవరైనా అదే చెబుతారు. ఆ భూమి మొత్తం పూసపాటి వంశీకులు ఇచ్చారనేది రికార్డుల్లో ఉన్న నిజం. భూమి ఎవరు ఇస్తే వారి పేరు పెట్టడం.. అనేది ఓ నిబంధనలా ఉంది.
అయినా పూసపాటి వాళ్లు తమ కుటుంబీకల పేర్లు పెట్టించుకోలేదు. గౌరవంగా మహారాజా ఆస్పత్రి అనే పిలుస్తున్నారు. దీన్ని కూడా జీవోల్లో లేదు.. జీవోలు ఇవ్వలేదు.. అని అడ్డగోలుగా వాదిస్తూ ఫ్యాక్ట్ చెక్ సమయాన్ని వృధా చేసుకుంటోంది. ఆ ఆస్పత్రికి మహారాజా పేరు ఉండేదో లేదో అందరికీ తెలుసు.. ఇప్పుడు బోర్డు తీసే్సినంత మాత్రాన ఎవరికీ తెలియదనుకోవడం.. అమాయకత్వమే.