ఏపీలో లాటరీ టిక్కెట్లు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గతంలో ఉన్నతాధికారులను లాటరీలు అమల్లో ఉన్న రాష్ట్రాలకు పంపి విధివిధానాలపై కసరత్తు చేసింది. అయితే ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఆ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా విజయనగరం జిల్లాలో మూడు బైకుల లక్కీ డ్రాను రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. మూడు లక్షల పెట్టి మూడు బైకులు ఇస్తారు.కానీ జిల్లా మొత్తంగా ఎంత మంది అయినా రూ.వంద పెట్టి టిక్కెట్ కొనుక్కోవచ్చు. అవి కోట్లలో ఉంటాయి. వాలంటీర్లతో కూడా కొనిపించే ప్లాన్ చేశారు.
ఈ లాటరీ టిక్కెట్ల వ్యవహారం విజయనగరంలో దుమారం రేపింది. ఇంతకు దిగజారిపోయిందేంటి అని ప్రభుత్వంపై అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ముందుగా అందరూ బొత్స సత్యనారాయణపైనే అనుమానాపడ్డారు. దీంతో ఆయన తనకేం సంబంధం లేదని చెప్పుకునేందుకు అధికారులను మందలించినట్లుగా మీడియాకు సమాచారం ఇప్పించారు. అయితే రవాణాశాఖ అధికారులు ఉత్తి పుణ్యానే ఇలాంటి పనులు చేయరని పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేసి ఉంటారని భావిస్తున్నారు.
మద్యం ఆదాయం రూ. ఆరు వేల కోట్ల నుంచి రూ. పాతిక వేల కోట్ల వరకూ పెంచుకున్నా ప్రభుత్వానికి మాత్రం సరిపోవడం లేదు. రకరకాల పన్నులు బాదేసినా చేసిన అప్పులకు వడ్డీలూ సరిపోవడం లేదు. ఏదో ఓ విధంగా ఆదాయం పెంచుకోవాలని తాపత్రయ పడుతోంది. దానికి లాటరీ టిక్కెట్లకు మించిన వ్యాపారం లేదని భావిస్తున్నట్లుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే విజయనగరంలో తేడా కొట్టడంతో ఈ విషయంలో ఎలాంటి వ్యూహం అమలు చేస్తారో చూడాల్సి ఉంది.