తెలుగుదేశం పార్టీ యువనేత, ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యండిల్ లో ప్రకటించారు. తాను ఇక ఏ రాజకీయ పార్టీలో చేరబోనని లాయర్ గా తన వృత్తిని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. ఫైబర్ నెట్ చైర్మన్ గా ఆయన కొద్ది కాలం కిందటే బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్నప్పటి నుండి దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు.
వారం రోజుల కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేరుగా ఫైబర్నెట్ ఎండీ ఐఏఎస్ దినేష్ పై ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు రాకుండా కాపాడుతున్నారని..410 మంది ఉద్యోగుల్ని తీసేయమని చెప్పినా ఇంకా జీతాలిస్తున్నారని ఆరోపించారు. ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆయన చేసిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఫీల్ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో సంబంధిత శాఖకు మంత్రి అయిన బీసీ జనార్ధన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఆటు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ ని, ఇటు ఆరోపణలు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డిని రెడ్డిని పిలిచించుకుని మాట్లాడారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అడిగినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో దినేష్ కుమార్ ను కూడా ఈ ఆరోపణలపై వివరణ అడిగారు. ఆయన తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇంతలో ఏమయిందో కానీ.. జీవీ రెడ్డి హఠాత్తుగా రాజీనామా చేశారు.
గతంలో వైసీపీలో పని చేసిన జీవీరెడ్డి అక్కడ సరైన గౌరవం లభించకపోవడంతో టీడీపీలో చేరారు. ఆయనకు మంచి వాగ్దాటి ఉండటంతో అధికార ప్రతినిది హోదా ఇచ్చారు. టీవీ చర్చల్లో ధాటిగా టీడీపీని సమర్థించేవారు. వైసీపీ తీరును ఎండగట్టే వారు. జీవీ రెడ్డి వ్యవహారంపై టీడీపీ క్యాడర్ లో సానుభూతి ఉంది. ఆయన వివాదాల వల్ల ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవచ్చు కానీ.. పార్టీకి రాజీనామా చేయకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.