మీడియాపై బ్యాన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ తప్పు ఒప్పుకోక తప్పలేదు. ఏపీ ఫైబర్ నెట్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లను ప్రసారం చేయక తప్పడం లేదు. మూడు సార్లు తీవ్రంగా హెచ్చరించి.. జరిమానా విధించి… చానళ్లు వస్తున్నాయో లేదో… పరిశీలనకు కమిటీని నియమించిన తర్వాత ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఏబీఎన్ చానెల్‌ను పునరుద్ధరించామని టీడీశాట్‌కు ఏపీ ఫైబర్ నెట్ తెలిపింది ఈనెల 20న ఏబీఎన్ చానెల్ పునరుద్ధరించామని …జరిమానా వేయొద్దంటూ టీడీశాట్‌కు ఏపీ ఫైబర్ నెట్ విజ్ఞప్తి చేసింది. జరిమానా ఎందుకు విధించకూడదో వివరిస్తూ.. రెండు రోజుల్లోగా ఆఫిడవిట్ వేయాలని ఏపీ ఫైబర్ నెట్‌కు టీడీశాట్ ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి జరిమానా విధించవద్దని ఫైబర్ నెట్ కోరింది.
తదుపరి విచారణ నవంబర్ 14వ తేదీకి టీడీశాట్ వాయిదా వేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ.. ప్రభుత్వానికి చెందిన ఫైబర్ నెట్లో టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లను… ప్రభుత్వం కొన్నాళ్ల కిందట నిలిపివేసింది. చానళ్లు టీడీశాట్‌లో ఫిర్యాదు చేసేసరికి.. సాంకేతిక కారణాలని.. సాకులు చెబుతూ వచ్చింది. అయితే.. టీడీశాట్ మాత్రం ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా స్వేచ్చకు భంగం కలిగిస్తున్నారని మండిపడింది. తీవ్రంగా హెచ్చరికలు పంపినా… స్పందించకపోవడంతో… రోజుకు రూ. రెండు లక్షల చొప్పున జరిమానా విధించింది. చివరికి.. తప్పు ఒప్పుకుని… ఏబీఎన్ , టీవీ5 ను మళ్లీ ప్రసారం చేసి.. జరిమానా విధించవద్దని వేడుకుంది.
అయితే ప్రభుత్వానికి చెందిన ఫైబర్ నెట్లో మాత్రం.. ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రైవేటు కేబుల్ ఆపరేటర్లను బెదిరించి నిలిపివేసిన ప్రసారాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు. కేబుల్ ఆపరేటర్లు నిలిపివేసిన వ్యవహారంతో తమకు సంబంధం లేదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కేబుల్ ఆపరేటర్ల లైసెన్సులకూ ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండటంతో.. వారు కూడా.. బ్యాన్ చేసిన చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.