ప్రపంచంలో ఎక్కడైనా నగరాన్ని అప్పు చేసి నిర్మించరని… దానంతట అదే నగరం అభివృద్ధి చెందుతుందని అసెంబ్లీ సాక్షిగా.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. గతంలో.. అసెంబ్లీ బయట ఎక్కడైనా అమరావతి ప్రస్తావన వస్తే.. మాకూ కట్టాలనే ఉంటుంది.. సమయం వచ్చినప్పుడు కడతామని చెప్పేవారు. కానీ.. ప్రపంచబ్యాంక్ రుణం ఆగిపోయిన తర్వాత… దానంతటకు అదే అభివృద్ధి చెంతుతుందనే.. విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ప్రపంచ బ్యాంక్ లేఖ రాసింది. అమరావతిలో మరో సారి పరిశీలన జరిపి రుణం మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని సమాచారం పంపింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని తెలిపింది…కానీ ప్రపంచ బ్యాంక్ రుణం వస్తుందని ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దీనితో శాశ్వతంగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే ప్రభుత్వం మాత్రం.. టీడీపీ దోపిడీని చూసి వరల్డ్ బ్యాంకు భయపడిపోయిందని.. అందుకే రుణం రాలేదని వాదిస్తోంది.
అమరావతిపై వైసీపీ సర్కార్ విధానం విషయంలో.. టీడీపీ అభ్యంతరాలు వేరేగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు నిర్మిస్తేనే ఏపీకి ఆదాయమని మాజీ సీఎం చెబుతున్నారు. అమరావతిపై వైసీపీ ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయాల కారణంగా.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అమరావతిని ఇంకా భ్రమరావతిగానే.. వైసీపీ నేతలు చూస్తున్నారని… చంద్రబాబు మండి పడుతున్నారు.
అమరావతి విషయంలో ప్రస్తుతం ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచనలు లేవని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేరుగా చెప్పినట్లయింది. ప్రస్తుతం నిర్మాణ కార్యకాలాపాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రుణం ఇస్తామన్నవారు కూడా వెనుకడుగు వేశారు. అదే సమయంలో.. ప్రస్తుత ప్రభుత్వం కూడా అమరావతిపై ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడం… అందులో అంతులేని అవినీతి జరిగిందన్న వాదన విపిస్తోంది. నవ్యాంధ్ర రాజధానిపై అసలు ఏపీ సర్కార్ విధానమేంటో.. అధికారికంగా వెల్లడించలేదు. కానీ.. అమరావతి విషయంలో.. తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ప్రాధాన్యతాంశాల్లో లేదని మాత్రం… రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.