ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల రాజకీయం జోరుగా సాగుతోంది. ఏపీ ప్రభుత్వం ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా చేస్తోందని అది దివాలా స్థితేనని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిని సమర్థించుకునేందుకు ప్రభుత్వం అటు ప్రభుత్వ పరంగా.. ఇటు రాజకీయ పరంగా ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వం అప్పులపై ఓ వివరణ పత్రం విడుదల చేసింది. దీని ప్రకారం… 2014-19లో అంటే టీడీపీ హయాంలోనే అప్పులు తారాస్థాయికి చేరాయని… తమ హయాంలో కాదని ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున అప్పులు తెచ్చామని ఒప్పుకున్న ఏపీ సర్కార్.. రెవెన్యూ భారీగా పడిపోయినా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారీగా ఖర్చు చేశామని చెప్పుకొచ్చింది. అదే సమయంలో అప్పుడు ఒక్క ఏపీనే చేయలేదని.. కేంద్ర ప్రభుత్వం కూడా చేసిందని చెప్పుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలో రూ. 18,48,655 కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందని గుర్తు చేసింది. పనిలో పనిగా.. గత ప్రభుత్వ పాలసీలు ఆర్థిక వ్యవస్థకు పక్షవాతం వచ్చేలా చేశాయని నిందించేశారు. ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కంటే పది వేల కోట్ల వరకూ ఎక్కువ అప్పులు చేస్తున్నట్లుగా కాగ్ రిపోర్ట్ బయటకు రావడంతో పాలన తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇదేం పాలన అని అందరూ విమర్శించడం ప్రారంభించారు. ప్రజల్లో కూడా చర్చ జరుగుతూండటంతో ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. రాజకీయంగా ఎదురుదాడే ఆ వివరణ.
ఓ వైపు ప్రభుత్వం విడుదల చేసిన పత్రంలో టీడీపీ హయాంలో చేసిన అప్పులనే ఎక్కువగా పేరొనగా.. వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి… చంద్రబాబు ఏమైనా సింగపూర్‌కు అప్పు ఇచ్చారా అంటూ వితండవాదాలు వినిపించారు. పేదలకు పంచడానికే జగన్ అప్పులు చేశారని వాదించారు. నిజానికి చేసిన అప్పులు ఎన్ని.. దేనికి ఖర్చు పెట్టారన్న శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయాలు బయటపడతాయనే బడ్జెట్ పెట్టలేదని అంటున్నాయి. దీంతో సమర్థించుకోవడానికి వైసీపీతో పాటు ప్రభుత్వం కూడా తంటాలు పడుతోంది.