వైసీపీలో ఇన్స్టంట్ న్యాయాలు ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్‌ను మెప్పించాలంతే. దానికి తాజా సాక్ష్యం .. గుర్రంపాటి దేవందర్ రెడ్డి. ప్రభుత్వ జీతం తీసుకుంటూ పార్టీ కోసం పని చేసే ఆయన రెండు రోజుల క్రితం నారా లోకేష్ టెన్త్ ఫెయిలయిన విద్యార్థులుతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డాయి. ” నువ్వు.. నీ బాబూ” అంటూ లోకేష్‌పై తిట్ల దండకం అందుకున్నారు. అలా ఆయన ఘనకార్యం చేసిన ఒక్క రోజులోనే ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ కు చైర్మన్ పదవి ఇచ్చేశారు. వెనువెంటనే ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. నారా లోకేష్‌ను ఆయన ఎదుటే తిట్టడంతో ఈ నజరానా అందిందని వైసీపీలో చర్చలు నడుతున్నాయి.
గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉండేవారు. ఆయన నేతృత్వంలోనే న్యాయస్థానాలపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్న ప్రచారం ఉంది. ఈ విషయంలో సీబీఐ కూడా ఆయనను ప్రశ్నించింది. ఈ వివాదం కారణంగా ఆయనను అనధికారికంగా సోషల్ మీడియా ఇంచార్జ్ పదవి నుంచి తప్పించారు. ప్రభుత్వ డిజిటల్ డైరక్టర్ పదవి పేరుతో నెలకు రూ. మూడు లక్షల వరకూ జీతం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయనకు నేరుగా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
రెడ్డి సామాజికవర్గానికి వారానికో పదవి చొప్పున ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు గుర్రంపాటికి కూడా ఇచ్చారు. సామాజిక న్యాయం పేరుతో బలహీనవర్గాలకు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. అసలు ఇస్తోంది మాత్రం ఒక్క సామాజికవర్గానికేనన్న విమర్శలు వస్తున్నాయి. బూతులు తిట్టే వారందరికీ ప్రోత్సాహం ఉంటుందన్న సంకేతాలను గుర్రంరెడ్డికి పదవి ఇవ్వడం ద్వారా పంపారు. అయితే ఇలా తిట్టి పదవులు సంపాదించుకున్నా.. అధికారం మారితే.. కుటుంబాలను వదిలేసి ఆజ్ఞాతంలోకి పోవాల్సి వస్తుందన్న ఉద్దేశంలో చాలా మంది ఇలాంటి పదవులపై ఆశలు వదిలేసుకుంటున్నారు.