తెలంగాణ కాంగ్రెస్ లో సమూల మార్పులు జరగనున్నాయి. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త పీసీసీ అధ్యక్షునిగా నియమించే పని ప్రారంభమైంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలతో బిజీగా ఉన్న పార్టీ అధిష్టానం వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై ద్రష్టి సారించినట్టు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో దూకుడు మీద ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని అడ్డుకోవాలంటే పటిష్టమైన వ్యూహరచన చేయాలన్నది పార్టీ అధిష్టానం ఆలోచనగా కనబడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చారనే సానుభూతి ఇక్కడి ప్రజలకు ఉన్న దాన్ని ఓటుగా మార్చుకోవడంలో స్థానిక నాయకత్వం విఫలమవుతోందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది. దీనికి కారణం పార్టీ సీనియర్ నాయకుల్లో ఉన్న ముఠా తగాదాలేనని, దీన్ని పరిష్కరించేందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అనుసరించిన ఫార్ములానే తెలంగాణలోనూ అనుసరించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్ష పదవి ముగ్గురికి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురిలో ఒకరు పీసీసీ అధ్యక్షుడు కాగా మిగిలిన ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులు. ఈ కేటాయింపుల్లో కూడా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుంది అధిష్టానం. ఎస్సీ వర్గానికి చెందిన వారిని పీసీసీ అధ్యక్షుడిగా, అగ్రవర్ణానికి చెందిన ఒకరిని, మైనార్టీలకు చెందిన మరొకరిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించింది. తెలంగాణలో కూడా ఏపీ ఫార్ములాను అనుసరించి అగ్రవర్ణ, దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా తెలంగాణలో అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతో పాటు పార్టీలో ఉన్న ముఠా తగాదాలు కూడా నిలువరించవచ్చు అన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉద్దేశంగా కనబడుతోంది.