రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల జగడం నేపధ్యంలో.. జరిగిన కేఆర్ఎంబీ భేటీ… తేలిగ్గా సాగిపోయింది. కోటాను మించి వాడుకున్నారు నీటి విడుదలను ఆపాలని.. కేఆర్ఎంబీ ఇప్పటికే ఏపీ సర్కార్ ను ఆదేశించింది. అయితే.. .. తమకు రెండు టీఎంసీల నీరు కావాలని ఏపీ సర్కార్.. శుక్రవారం జరిగిన భేటీలో ప్రతిపాదన పెట్టింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో కేఆర్ఎంబీ రెండు టీఎంసీల నీటిని విడుదల చేసుకోవడానికి అంగీకారం తెలిపింది. రుతుపవనాలు వచ్చే వరకూ.. తాగునీటి అవసరాల కోసం.. ఈ రెండు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోనుంది. సాగర్ కుడి కాలువ ద్వారా.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి కోసం ఈ నీటిని పంప్ చేసుకుంటారు.
నిజానికి కృష్ణాలో ప్రస్తుతం 60 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో.. 57 టీఎంసీలు వాడుకోవడానికి తెలంగాణకు హక్కు ఉంది. ఇప్పటి వరకూ కేటాయించిన నీటిలో తెలంగాణ తక్కువగా వినియోగించుకుంది. ఆ నీటిని వాడుకోవలేదు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానుంది. రుతుపవనాలు మరో వారం .. పది రోజుల్లో వస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. కృష్ణాబేసిన్ లో వర్షాలు ప్రారంభమైతే.. వరద వస్తుంది. ఆ తర్వాత సీజన్‌కు మళ్లీ కొత్త కేటాయింపులు చేస్తారు. పాత నీటిని వినియోగించుకోలేదని.. ఆ నీటిని తర్వాత ఏడాదికి బదిలీ చేయడానికి లేదు.
ఏ ఏడాదికి ఆ ఏడాది మాత్రమే ఉపయోగించుకోవాలి. దాంతో.. ఇప్పుడు… అందుబాటులో ఉన్న మొత్తాన్ని తెలంగాణ వాడుకునే అవకాశం లేదు కాబట్టి.. ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ మాత్రం.. తమకు కావాల్సిన కోటాలోనే అడిగామని.. కృష్ణాబోర్డు అంగీకరించిందని.. వాదిస్తోంది. మొత్తానికి ఏదైనా కానీ.. వేసవి కాలంలో… దారం తీర్చేందుకు రెండు టీఎంసీల నీరు.. ఏపీకి విడుదలవబోతోంది.