ఏపీ ప్రభుత్వం జీవోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మీడియాకు సమాచారం ఇచ్చింది. ఏపీ ఈ-గెజిట్ వెబ్ సైట్ కొన్ని జీవోలను ఉంచుతున్నామని తెలిపింది. అయితే ఆ వెబ్ సైట్ చూస్తే అందులో మూడు, నాలుగు మాత్రమే ఉత్తర్వులు ఉంటున్నాయి. 7వ తేదీన నాలుగు, ఆరో తేదీన మూడు జీవోలను ఉంచారు. ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఏపీ ఈ-గెజిట్లో ఉంచబోవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయన్న కారణంగా ఆగస్టు 16వ తేదీన ఏపీ ప్రభుత్వం జీవోలన్నింటినీ రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైతే మూడు, నాలుగు జీవోలు పెడుతున్నారు.. ఇక నుంచి పెంచుతారేమో చూడాలి.
మాన్యువల్ పద్దతిలో జీవోల రిజిస్టర్ నిర్వహించాలని ఆన్ని శాఖలనూ ఆదేశించారు. అప్పటి నుండి ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవోఐఆర్ వెబ్సైట్లో జీవోలు అప్ లోడింగ్ నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలన్నీ రహస్యంగా ఉంచాలని నిర్ణయించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఏ విధంగా చూసినా ప్రభుత్వ నిర్ణయం నిలబడదని ఇప్పటికే న్యాయనిపుణులు తేల్చి చెబుతున్నారు. సమాచార హక్కు చట్టంతో పాటు వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందే. అయితే ఇక్కడ ఓ చిన్న వెసులుబాటు ఉంది.
అదేమిటంటే కొన్ని జీవోలను రహస్యంగా ఉంచవచ్చు. దీన్ని ఉపయోగించుకుని ప్రజలకు అవసరమైన జీవోలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పేందుకు ప్రభుత్వం కొత్త ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు వందల కొద్దీ జీవోలను వివిధ శాఖలు విడుదల చేస్తూంటాయి. కానీ గెజిట్ వెబ్ సైట్లో మూడు లేదా నాలుగు మాత్రమే ఉత్తర్వులు అందుబాటులో ఉంచుతున్నారు. కోర్టును కూడా మభ్య పెట్టే ప్రయత్నమన్న విమర్శలు అప్పుడే ప్రారంభమయ్యాయి.