ప్రస్తుతం కేంద్రం, ఏపి ప్రభుత్వం మధ్య ‘ప్రత్యేక’ సమస్య తలెత్తింది. అయితే ఇదేమీ కొత్తగా తెలిసిన విషయం కాదు. హోదా ఇవ్వదనే విషయం అందరికీ ఎప్పుడో తెలుసు. కానీ ఇప్పుడే కొత్తగా తెలిసినట్లు రాష్ట్ర నేతలందరూ తెగ నటించేస్తున్నారు. మళ్ళీ ధర్నాలు, రాష్ట్ర బంద్ లు చేద్దామని కూడబలుకొంటున్నారు. అందరినీ తమతో కలిసి రమ్మని కోరుతున్నారు. లేకుంటే ద్రోహుల స్టాంప్ వేసేస్తామని బెదిరిస్తున్నారు. ఈ కారణంగా తెదేపా నేతలు కూడా స్వరం పెంచి కొంచెం గట్టిగా మాట్లాడవలసి వస్తోంది. ఈసారి కేంద్రం కూడా స్వరం పెంచి జవాబులు ఇవ్వడమే కొత్త డెవలప్మెంట్ గా కనబడుతోంది. అయితే ఇలాంటి యుద్ధవాతావరణం గతంలో కూడా ఏర్పడింది. అప్పుడూ అందరూ ఏదేదో మాట్లాడేశారు. తెదేపా, భాజపాలయితే ఇంక తెగతెంపులు చేసుకోబోతున్నాయా అన్నట్లుగా కీచులాడుకొన్నాయి. ఆ తరువాత మోడీ ప్రభుత్వం ఏవో కొన్ని నిధులు విదిలించడం, చంద్రబాబు వెనక్కి తగ్గడం మళ్ళీ రెండు పార్టీలు కలిసిపోవడం, అపుడప్పుడు రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలు కీచులాడుకోవడం అన్నీ రొటీన్. బహుశః ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే జరుగుతుందేమో? ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో రెండు పార్టీలు ఒంటరిగా మనుగడ సాగించడం చాలా కష్టం. తెదేపా ప్రభుత్వానికి కేంద్రం సహాయసహకారాలు చాలా అవసరముంది. భాజపాకి రాష్ట్రంలో చెడ్డపేరు రాకుండా ఉండేందుకు తెదేపాతో స్నేహంగా ఉండటం చాలా అవసరం. కనుక మళ్ళీ రెండూ చల్లబడక తప్పదు. చల్లబడకపోతే వాటిని చల్లబరిచేందుకు మద్యలో మన వెంకయ్య ఉండనే ఉన్నారు. ఆయనే తన మంత్రిత్వ శాఖ నుంచి ఓ వెయ్యి కోట్లు వెంటనే మంజూరు చేసేసి, జైట్లీ జేబులోనుంచి కూడా మరో రెండో మూడో వేల కోట్లు తీసి ఇప్పించవచ్చు. ఆ తరువాత మళ్ళీ అంతా రొటీన్ స్టోరీయే!