ప్రశ్నిస్తే ఎంతంటి వారికైనా గ్యారంటీ ఉండదని చెప్పేలా ఏపీలో పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ ఫోన్ ట్యాపింగ్ , ఆర్థిక వ్యవహారాలు ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యేగా ఆయనకు ఉండాల్సిన భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశించినట్లుగా ప్రచారం జరిగింది. గన్ మెన్లు వెళ్లిపోయారు. ఆయనకు భద్రత తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు బయటకు రాలేదు. కానీ తీసేసిన విషయం మాత్రం వెలుగులోకి వచ్చింది.
పయ్యావులకు ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద భధ్రత కల్పించలేదని.. ఎమ్మెల్యేగా ఆయన హక్కు అని టీడీపీ నేతలు వాదించారు. కాసేపటికే పయ్యావులకు ఎలాంటి భద్రత తొలగించలేదని వన్ ప్లస్ వన్ భద్రత కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. నిజానికి పయ్యావుల … సమస్యాత్మక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు మరింత భద్రత కల్పించాల్సి ఉంది. ఈ మేరకు ఆయన పెట్టుకున్న దరఖాస్తును పోలీసులు ఇంత వరకూ పట్టించుకోలేదు. హఠాత్తుగా ఆయనకు ఉన్న భద్రతను తొలగించారు.
అయితే ఇది వ్యూహాత్మకంగా చేసిన పనేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తమపై విమర్శలు చేస్తే.. గ్యారంటీ ఉండదని హెచ్చరించినట్లుగా ఈ చర్య ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భయపెట్టే చర్యగా చెబుతున్నారు. అయితే ఇలాంటి వాటికి భయపడే పరిస్థితులు పోయ్యాయని దాడులు చేసినా వెనుకడుగు వేయబోమని టీడీపీ నేతలంటున్నారు.