ఏపీలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు జీవోను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అందుకు కారణం కూడా చెప్పింది .. ఏమిటంటే ఆ వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేశారు కానీ ఇంకా చార్జ్ తీసుకోలేదు. హైకోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి. పేరుకే జీవో ఉంది దాన్ని క్యాన్సిల్ చేసేసి కొత్త వక్ఫ్ బోర్డును నియమిస్తూ జీవో జారీ చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఈ మేరకు జీవోను క్యాన్సిల్ చేశారు. కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు.
అయితే ఇదేదో బాగుందని బీజేపీ జాతీయ వాదులు, నయా హిందూత్వ వాదులు.. బీజేపీ సోషల్ మీడియాలో పండిపోయినవారు అసలు ఏపీలో శాశ్వతంగా వక్ఫ్ బోర్డును రద్దు చేసినట్లుగా ప్రచారం ప్రారంభించారు. అరకొర సమాచారంతోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇది కూడా అంతే వైరల్ అయిపోయింది. దీంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఫేక్ న్యూస్ ను పద్దతిగా ప్రచారం చేయడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న బీజేపీ సోషల్ మీడియాకు చెందిన అమిత్ మాలవీయకు ఏపీ ఫ్యాక్ట్ చెక్ పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చింది. వక్ఫ్ బోర్డును పూర్తి స్థాయిలో రద్దు చేయలేదని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తామని తెలిపింది.
అయితే ప్రస్తుతం వక్ఫ్ బోర్డు అనేది జాతీయ స్థాయిలో కీలక అంశంగా ఉంది. వక్ఫ్ బోర్డు చట్టసవరణ బిల్లు పార్లమెంట్లో ఉంది. జేపీసీ వద్ద ఉంది. జేపీసీ అభిప్రాయం పార్లమెంట్ కు వచ్చిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. జరుగుతున్న సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతారని అంటున్నారు. అందుకే ఏపీలో వక్ఫ్ బిల్లు రద్దు అనగానే విస్తృతంగా ప్రచారం జరిగిపోయింది. చివరికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ వెనుకబడిపోయింది కానీ.. క్యాన్సిల్ చేసిన జీవో మాత్రం వైరల్ అయిపోయింది.