ఏదైనా ఓ పని అప్పగిస్తే .. నమ్మకంగా చేసి చూపించాలి. టైం అయిపోయిన తర్వాత చేయలేకపోయాను.. చేత కాలేదు అని కారణం చెబితే ఎలా ఉంటుంది. ఎవరికైనా మండి పోతుంది. అలాంటి కారణం చెప్పాలంటే ఎవరైనా సిగ్గుపడతారు. కానీ ఏపీ ప్రభుత్వానికి అలాంటి దాపరికాలు ఏమీ లేవు. చేయలేకపోతున్నాం… మీ కష్టాలు అనుభవించడని.. ఆయా వర్గాలకు నేరుగానే చెబుతున్నారు. రోడ్ల దగ్గర్నుంచి కరెంట్ వరకూ.. సీపీఎస్ రద్దు దగ్గర్నుంచి పీఆర్సీ వరకూ అన్నీ అలాగే చేస్తున్నారు.
కరెంట్ ఇవ్వాలని జగన్‌కూ ఉందని కానీ ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోంది. బహిరంగ మార్కెట్లో కరెంట్ దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక ఉద్యోగుల సమస్యలపైనా అదే చెబుతున్నారు. జగన్ ఎంతో చేయాలనుకుంటున్నారని ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం వల్ల చేయలేకోతున్నామని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని నిర్మోహమాటంగా చెబుతున్నారు. అలా ఎదుకు చితికిపోయిందో మాత్రం చెప్పడం లేదు. మూడేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించేశామని వారు పరోక్షంగా ప్రజలకు చెబుతూనే ఉన్నారు.
ప్రభుత్వం పాలనపై పూర్తి స్థాయిలో పట్టు కోల్పోయిందన్న విమర్శలు ఇలాంటి నిర్ణయాల వల్లే వస్తున్నాయి. తాము ఏమీ చేయలేమని.. ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. కరెంట్ మార్కెట్లో దొరకడం లేదని.. అప్పులు పుట్టుడం లేదని.. ఇలా రకరకాల కారణాలను చెబుతోంది. అయితే ప్రజలు అధికారం ఇచ్చింది.. కారణాలు చెప్పడానికి కాదని.. చేసి చూపించడానికన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు మర్చిపోతున్నారు. ఈ విషయంలో ఫెయిలైతే.. తర్వతా ఓటర్లు కూడా కారణాలు చెప్పరు.. చేసి చూపిస్తారన్న సటైర్లు పెరిగిపోతున్నాయి.