ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… దశలవారీ మద్య నిషేధానికి ప్రయత్నిస్తోంది. బడ్జెట్లో ఆదాయం పెంపును చూపించడంతో… విమర్శలు వచ్చినప్పటికీ.. అనుకున్న విధంగా.. చేయడానికి తన వంతు ప్రయత్నాలు మాత్రం సీరియస్‌గానే చేస్తోంది. మద్యాన్ని ప్రభుత్వమే అమ్మాలని నిర్ణయించుకోవడమే కాదు.. తొలి విడతగా ఇరవై శాతం షాపుల్ని తగ్గించాలని నిర్ణయించుకుంది. కొత్త విధానం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది.
ఈ ఏడాది తగ్గనున్న 20 శాతం మద్యం దుకాణాలు..!
ఏపీలో ప్రస్తుతం 4, 377 మద్యం షాపులు ఉన్నాయి. వీటిని 3, 500కి కుదించాలని నిర్ణయించారు. ఇలా ఏడాదికి ఇరవై శాతం చొప్పున తగ్గిస్తూ పోయి… ఎన్నికల ఏడాది 2024 నాటికి స్టార్ హోటల్స్‌లో మాత్రమే.. మద్యం లభించేలా చేయనున్నారు. అంటే.. మద్యాన్ని క్రమక్రమంగా సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం అన్నమాట. ఇక ఈ షాపులకు అనుబంధంగా ఉన్న బెల్ట్ షాపులు కూడా ఇక ఉండకూడదని.. జగన్ నిర్ణయించారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మద్యం అమ్మకాలు చేయిస్తుండటం ద్వారా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, ఇప్పుడు ప్రభుత్వమే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించడంతో రోజురోజుకు మద్యం వినియోగం తగ్గనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అమ్మకాలపై అధికారులకు టార్గెట్లు పెట్టరు..!
ఓ వైపు షాపులను తగ్గిస్తూ మరో వైపు మద్యం అమ్మకాలు తగ్గేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మద్యం వినియోగం విపరీతంగా పెరగడానికి కారణం అందుబాటులో ఉండడమే అని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించనున్న మద్యం దుకాణాలకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్ మెన్స్ ను ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా నియమించుకోవాలని నిర్ణయించారు. హైవేలపై ఆనుకుని ఉన్న మద్యం షాపులను పూర్తిగా తొలగించటంతో పాటు అమ్మకాల కోసం… అధికారులకు టార్గెట్లు పెట్టకూడదని నిర్ణయించారు.
అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తేనే ప్రజల్లో నమ్మకం..!
అయితే… ప్రభుత్వం మద్యం విధానంపై ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే.. మద్యం షాపులు ప్రభుత్వమే నడిపితే.. లేనిపోని సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే లైసెన్స్ ఫీజు భారీగా పెంచి… లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేవాళ్లను కొనసాగించి.. మిగతా చోట్ల ప్రభుత్వమే నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే మొత్తానికే తేడా వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్లనే.. మద్యనిషేధంపై.. చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు అర్థమవుతుంది.