ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి అన్ని అలవెన్సులతో కలిసి నెలకు రూ. రెండు లక్షల రెండు వేల జీతం వస్తుంది. కానీ.. పక్క రాష్ట్రం నుంచి సలహాదారుగా నియమితులైన దేవులపల్లి అమర్ అనే సాక్షి జర్నలిస్టుకు రూ. 3లక్షల 82వేల జీతం అందుతుంది. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పదుల సంఖ్యలో నియమించుకున్న సలహాదారుల్లో… అమర్ ఒకరు. ఇప్పటికీ మీడియా కమ్యూనికేషన్స్ సలహాదారు ఒకరున్నారు. అమర్ కేవలంం.. అంతర్రాష్ట్ర మీడియా వ్యవహారాలు చూస్తారు. అంటే.. ఆయన అమరావతిలో కూడా పని చేయాల్సిన అవసరం లేదన్నమాట.
అమర్‌కు.. సివిల్ సర్వీసు అధికారులు సర్వీసంతా కష్టపడినా.. రానంత జీతం…!
తెలంగాణకు చెంది.. సాక్షిలో పని చేస్తున్న దేవులపల్లి అమర్ ను.. జగన్ సీఎం అయిన కొద్ది రోజులకే అంతర్రాష్ట్ర మీడియా సంబంధాల సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. ఆయనకు.. జీతం, అలవెన్సులు, పెట్రోలు ఖర్చులు, ఫోన్ డేటా.. ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తూ జీవో జారీ చేశారు. నెలకు మొత్తంగా ఆయనకు రూ. 3 లక్షల 82వేల ప్రజాధనాన్ని ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసేశారు. ప్రభుత్వానికి పెద్దలా వ్యవహరిస్తూ.. ఇరవై నాలుగు గంటలూ సర్వీసులో ఉండే.. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎవరికీ నెలకు ఇంత జీతం లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులకు అన్ని అలవెన్సులతో కలిపి.. రూ. రెండు లక్షల వరకు మాత్రమే అందుతుంది. ఇంత జీతం ఇస్తూ జీవో జారీ చేసిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కి కూడా.. అంత జీతం ఉండదు.
తెలంగాణ ఉద్యమకారుడు ఏపీ బాగు కోసం సలహాలిస్తారా..?
దేవులపల్లి అమర్ అనే నిపుణుడు.. సీఎంకి ఎలాంటి సలహాలిస్తారు..? అమర్ సలహాలను ఆయన తీసుకుంటారా..? లాంటి విషయాలను ఎవరూ అడగరు.. పట్టించుకోరు. ఆయన సలహాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా లాభం ఉంటుందా..? అంటే.. ఆదిశగా అసలు ఆలోచన చేయనే కూడదు. ఎందుకంటే.. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన తెలంగాణ ఉద్యమం అంటే.. ఆంధ్రుల్ని తిట్టడమే అనుకునే భావాన్ని పెంచి పోషించిన “చైతన్యవంతమైన” జర్నలిస్టుల్లో ఒకరు. అలాంటి జర్నలిస్టు..ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ఏపీ సీఎంకు సలహాలిస్తాడని ఆశించడం అత్యాశే. వాటిని అమలు చేసి.. ఏపీ సీఎం ప్రజలు మేలు చేస్తాడని ఆశపడితే..నిరాశే.
సీఎంకు రూపాయే.. ఆయన సలహాదారుల బడ్జెట్ కోట్లు..!
నిజానికి ఇతర సలహాదారులతో పోలిస్తే.. దేవులపల్లి అమర్‌కు జీత భత్యాలు తక్కువే. ప్రస్తుత సర్కార్‌లో… అత్యంత కీలక పాత్ర పోషిస్తూ.. అప్పట్లో కేవీపీ తరహాలో.. ఇప్పుడు.. పాలనా వ్యవహారాలు.. డీలింగ్స్‌లో జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ లాంటి వాళ్లు.. బేసిక్ శాలరీ మూడు లక్షలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వారికి అదనంగా.. అంతే మొత్తంలో అలవెన్స్ లు కార్లు.. ఇతర సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇతర సలహాదారులకూ… అమర్ కు ఇచ్చినంతగా ఇస్తున్నారు. అంటే.. సీఎం సలహాదారుల కోసం.. నెలకు.. ఎలా లేదన్న… జీత భత్యాలు.. మూడు నాలుగు కోట్ల వరకూ తేలుతున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం ఒక్క రూపాయే జీతం తీసుకుంటున్నారు.. కానీ ఆయన సలహాదారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు.