హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి భూసేకరణకోసం భూసేకరణ చట్టాన్ని ఉపయోగించొద్దని పవన్ కళ్యాణ్ నిన్న ట్విట్టర్ ద్వారా చేసిన సూచనకు టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే భూమిని రైతులకు ఇబ్బందిలేని పద్ధతుల్లోనే సేకరిస్తామని రాష్ట్ర పురపాలకశాఖమంత్రి నారాయణ స్పష్టంచేశారు. జనసేన అధినేత చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. అమరావతి నిర్మాణంపై ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని సలహా మండలితో విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నారాయణ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కోరినట్లే రైతులెవరికీ ఇబ్బంది కలగనిరీతిలోనే ల్యాండ్ పూలింగ్ చేపడతామని చెప్పారు. ఈనెల 20వ తేదీలోగా ల్యాండ్ పూలింగ్‌కు రైతులు ముందుకు రావాలని సూచించారు. ఇప్పటివరకు రాజధానికోసం 34వేల ఎకరాలు సేకరించామని, మరో 2,200 ఎకరాలు అవసరమని తెలిపారు. రాజధాని ప్రకటన తర్వాత భూమి ధర భారీగా, 20 రెట్లు పెరిగిందని చెప్పారు.