తెలుగుదేశం పార్టీ డేటా చోరీ విషయంలో.. దర్యాప్తు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఈ సిట్ ఏర్పటయింది. సీనియర్ ఐపీఎస్‌లతో పాటు సాంకేతిక నిపుణులు ఈ బృందంలో ఉండనున్నారు. బుధవారం సాయంత్రం.. టీడీపీ నేతలు… గుంటూరు రూరల్ ఎస్పీకి తమ పార్టీ డేటాలను వైసీపీ నేతలతో కలిసి కుట్ర పన్ని.. తెలంగాణ పోలీసులు చోరీ చేశారని… ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి తమ డాటా ఉన్న ఐటీ గ్రిడ్ కార్యాలయంలో.. గత నెల ఇరవై మూడో తేదీన సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అధికారుల సీసీ టీవీ ఫుటేజీని అందించారు. అలాగే.. వైసీపీ కాల్ సెంటర్ నుంచి టీడీపీ నేతలకు వస్తున్న కాల్స్ వివరాలను కూడా అందించారు. దీంతో.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రధానంగా హైదరాబాద్‌లో పోలీసులు, వైసీపీ నేతలతో పాటు.. అక్కడ కొంత మంది రాజకీయ నేతల ప్రమేయంతో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తూండటంతో.. ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది.
మరో వైపు ఏపీ ప్రభుత్వ డేటా.. టీడీపీయాప్లో ఉందంటూ… రెండు కేసులు నమోదు చేసిన.. తెలంగాణ ప్రభుత్వం.. ఆ రెండింటిని కలిపి… స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఓ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఉదయం సమావేశమై… రెండు ఫిర్యాదులను… వారు ఫిర్యాదు చేసిన సాంకేతిక అంశాలను.. అలాగే ఇప్పటి వరకూ.. ఐటీ గ్రిడ్ నుంచి.. స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని విశ్లేషించుకున్నారు. ఎలా ముందుకెళ్లారో చర్చించారు. మూడు బృందాలుగా.. తొమ్మిది మంది సభ్యులు విడిపోయి… ఓ బృందం.. ఐటీ గ్రిడ్ యజమాని అశోక్ కోసం.. మరో బృందం.. ఐటీ గ్రిడ్‌కు సంబంధించిన మిగతా సమాచారం ఎక్కడుందో సేకరించడానికి.. మరో బృందం.. అనుమానితుల్ని ప్రశ్నించడానికి సిద్ధం అయ్యారు.
అయితే.. ఈ కేసులో ఇంత వరకూ ప్రాధమిక సాక్ష్యాధారాలు కూడా లేవన్న అభిప్రాయం.. టెక్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సేవా మిత్ర యాప్‌లో ఉన్న సమాచారం.. కానీ.. ఇతర సమాచారం కానీ.. ఏపీ ప్రభుత్వ డేటాకు సంబంధించినది కాదని.. స్వంతంగానే సేకరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. ఏ విధంగా.. ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలా అన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. మరో వైపు ఏపీ ప్రభుత్వం.. టీడీపీ డేటా చోరీ విషయంలో.. సీరియస్‌గా ఉంది. పక్కా సాక్ష్యాలు ఉండటంతో.. నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. మరో వైపు ప్రభుత్వం తెలంగాణ పోలీసులపై… దుష్ప్రచారం చేస్తున్నారని.. పరువు నష్టం దావా వేయబోతున్నారు. దీనికి సంబంధించి సజ్జన్నార్.. ప్రెస్మీట్లో మాట్లాడిన మాటల్నే సాక్ష్యంగా పెట్టబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.