అమరావతి అక్రమాలను నిగ్గు తేలుస్తామంటూ.. ఓ కమిటీ వేసిన ఏపీ ప్రభుత్వం… అసలేం తేల్చిందో మాత్రం ఇంత వరకూ బయట పెట్టలేదు. తాజాగా మరో కమిటీని నియమించింది. అయితే.. ఈ సారి అవినీతి, అక్రమాల గురించి కాకుండా… మరో అంశాన్ని ఎంచుకుంది. వరద వస్తే మునుగుతుందని.. ఖర్చు ఎక్కువ అవుతుందని… మంత్రి బొత్స చేసిన ప్రచారానికి అనుగుణంగా… ఆ అంశాలపై ఓ నివేదిక తెప్పించుకోవడానికే.. ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధిని సమీక్షించడమే కాకుండా సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలను కూడా సూచిస్తుందని నియామక ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది. సమగ్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా రాజధాని అభివృద్ధిని కూడా సూచిస్తుందని ప్రభుత్వం చెబుతోంది
ఢిల్లీ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూల్ లో ప్లానింగ్ డీన్ ప్రొఫెసర్ మహావీర్, పట్టణ ప్రణాళిక ప్లానర్ అంజలీ మోహన్, అహమ్మదాబాద్ లోని సీఈపీటీకి చెందిన ప్రొఫెసర్ శివానందస్వామి, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, చెన్నైలోని రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ డాక్టర్ కేవీ అరుణాచలంతో కమిటీలో ఉంటారు. వీరితో పాటు పర్యావరణ, వరద యాజమాన్యంలో నిపుణులైన మరోకరిని కమిటీ నియమించుకోవచ్చని ఉత్తర్వుల్లో సూచించారు. ఈ కమిటీకి కన్వీనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు వ్యవహారిస్తారు. ఈ కమిటీ సంబంధిత అంశాలపై అధ్యయనం చేసి ఆరు వారాల్లో తమ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని వివరించారు.
నిజానికి రాజధాని అభివృద్ధికి ఇప్పటికే గత ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ఈ ప్లాన్ ఆధారంగానే ప్రభుత్వం నిర్మాణాలను కూడా చేపట్టింది. సచివాలయ టవర్స్, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించిన టవర్స్ నిర్మాణం కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పట్టణాలు, అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ఒక కమిటీని నియమించడం … ముందస్తు ప్రణాళికలో భాగమేనని చెబుతున్నారు. కావాల్సిన నివేదిక ఇప్పించుకుని తమ ప్లాన్ ను అమలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.