అమరావతి ప్రజా రాజధాని…దానిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి..అని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్పే మాట ఇప్పుడు చెప్పడం లేదు. కారణం రాజధాని వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి, విదేశాలకి సంబంధించిన వ్యవహారంగా మారిపోవడమే. ప్రజల భాగస్వామ్యం కేవలం విరాళాల వరకే పరిమితం. కనుక స్విస్ ఛాలెంజ్ అంటే ఏమిటి? రాజధానిని ఎవరు నిర్మించబోతున్నారు? ఏవిధంగా నిర్మించబోతున్నారు? అని రాష్ట్ర ప్రజలు ఎవరూ బుర్రలు వేడెక్కించుకోనవసరమే లేదు. కానీ ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకో(లే)వు గనుక సింగపూర్ సంస్థలకి 58 శాతం ఎందుకు కట్టబెడుతున్నారు? వాటితో ఏమేమి రహస్య ఒప్పందాలు చేసుకొన్నారు? అందులో మీ వాటా ఎంత? అంటూ యక్ష ప్రశ్నలు వేస్తున్నాయి. సింగపూర్ వంటి అద్భుతమైన రాజధాని కడదామని ఆలోచిస్తుంటే ప్రతిపక్షాలు ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా హర్ట్ అయిపోయింది. కానీ హర్ట్ అవడం కూడా అలవాటైపోయినందున వారి విమర్శలు, ఆరోపణలు పట్టించుకోకుండా ముందుకే…అభివృద్ధి పధంవైపే సాగిపోవాలని ఫిక్స్ అయిపోయింది.
అయితే ఏడాదిన్నర క్రితమే స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధానిని నిర్మిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా దానిని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం ఏమిటో..ఎందుకో అని వద్దనుకొన్నా సామాన్యులు ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఇదివరకే అనుకొన్న ఆ ఛాలెంజ్ ని మంత్రివరం మరోమారు ఆమోదించడం, రైతులు తనని నమ్మి 33,000 ఎకరాలు భూమిని ఇవ్వడం వంటి అందరికీ తెలిసిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తరువాత గ్లోబల్ టెండర్లు పిలిచి 45 రోజులలో స్విస్ ఛాలెంజ్ పై తుది నిర్ణయం తీసుకొంటామని చెప్పడంతో మళ్ళీ కధ మొదటికి తెచ్చేరా? అని అందరూ అయోమయపడ్డారు.
గ్లోబల్ టెండర్లు పిలిస్తే మళ్ళీ ఎన్నోకొన్ని దేశాలు టెండర్లు వేస్తాయి. మళ్ళీ వాటిని ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాటిలో ఏదో ఒక దానిని ఖరారు చేస్తుంది. అదేదో కొత్త షరతులు చెపుతుంది. దానితో మళ్ళీ ప్రభుత్వం బేరాలు ఆడుతుంది. బేరం కుదిరితే దానితో ఒప్పందం చేసుకొంటుంది. కుదరకపోతే వేరే దానితో మళ్ళీ ఈ తతంగం అంతా సాగుతుంది. ఇది వరకు సింగపూర్ సంస్థలతో ఈ తంతాగం అంతా నడిపించిన తరువాత మళ్ళీ గ్లోబల్ టెండర్లు పిలుస్తామని ముఖ్యమంత్రి చెప్పడం వలననే ఈ అయోమయం ఏర్పడింది. మళ్ళీ ఈ తతంగం అంతా కొత్తగా మొదలుపెడితే అది ఇంకా ఎన్నాళ్ళు సాగుతుందో తెలియదు. కనుక రాజధాని నిర్మాణ పనులు ఇంకా ఎప్పుడు మొదలవుతాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఆ విదేశీ సంస్థలకే తెలియాలి. అంతవరకు ఈ అమరావతి కధలు చెప్పుకొంటూ, వింటూ ప్రజలందరూ ఓపికగా ఎదురుచూడక తప్పదు.