ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా విజయవాడకు తరలివచ్చి చాలా కాలం అవుతున్నా హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం విజయవాడ తరలిరావడానికి ఇష్టపడటం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో సుమారు 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తమకి విజయవాడలో ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్ళు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి అయిష్టతకి అసలు కారణాలు చాలానే ఉన్నాయి. కొందరి పిల్లలు చదువులు మధ్యలో ఉండటం, మరికొందరి జీవిత భాగస్వాములు ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తుండటం, చాలా మంది హైదరాబాద్ లో ఇళ్ళు కట్టుకొని స్థిరపడటం, స్థానికత వంటి అనేక సమస్యలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న సమస్యలను తీర్చడానికి సంసిద్దత వ్యక్తం చేస్తోంది కానీ ఇంకా అనేక ఇతర కారణాల చేత ఉద్యోగులు విజయవాడ తరలివచ్చేందుకు అయిష్టత చూపుతున్నారు. అయితే ఎల్లకాలం ఇలాగే ప్రభుత్వం నడిపించడం సాధ్యం కాదు కనుక ఈ సమస్యకు ఎప్పుడో అప్పుడు ఏదో ఒకవిధంగా పరిపరిష్కారం కనుగొనవలసి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కొత్త ప్రతిపాదన చేస్తూ ఊతర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా జూన్ లోపుగా ఉద్యోగులు విజయవాడకు తరలిరావలసి ఉంటుంది. ఈ మూడు నెలల్లో ఉద్యోగులు తమకు అనుకూలమయిన సమయం ఎంచుకొని ప్రభుత్వానికి తెలియజేయవలసి ఉంటుంది. కానీ ఉద్యోగులలో చాలా మంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రతీ ప్రతిపాదనను ఉద్యోగులు ఇలాగే వ్యతిరేకిస్తూ విజయవాడకి తరలిరావడానికి అయిష్టత చూపుతున్నట్లయితే, దాని వలన పరిపాలనపై తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారితో కటినంగా వ్యవహరించక తప్పదు. కనుక ఉద్యోగ సంఘాల నేతలు పరిస్థితి అంతవరకు రాకమునుపే ఈ సమస్యకు మధ్యే మార్గంగా ఏదో ఒక పరిష్కారం అత్యవసరంగా కనుగొనవలసి ఉంటుంది.