వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు.. వంతెనలు , బ్రిడ్జిలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా జన సమీకరణ చేసేవారు. ఆ బ్రిడ్జి పట్టనంత జనం వచ్చారని డ్రోన్లతో షూట్ చేసుకుని సాక్షిలో గ్రాఫిక్స్ యాడ్ చేసి చూపించుకుని సంతోషపడేవారు . రాజమండ్రి వంతెనపైకి పాదయాత్ర వచ్చినప్పుడు వైసీపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు రైతులు పాదయాత్ర చేస్తున్నారు. వారి పాదయాత్ర రాజమండ్రి దగ్గరకు వస్తుందనగానే… తమ పాదయాత్రను మించి జనం వస్తారని భయపడ్డారేమో కానీ.. వెంటనే మూసేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఇన్నేళ్లుగా రాజమండ్రి రోడ్ కం రైలు వంతెన మరమ్మతులకు ప్రభుత్వం రూపాయి కేటాయించలేదు. ఇప్పుడూ కేటాయించ లేదు. కానీ హఠాత్తుగా మరమ్మతుల కోసం వారం రోజులు మూసేస్తున్నామంటూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్ని చూసి అందరూ… రైతుల పాదయాత్ర అంటే ఇంత భయమేంటి అనుకుంటున్నారు. కొత్తగా మరమ్మతులకు ఎలాంటి నిధులు విడుదల కాకపోయినా.. పనులకు టెండర్లు పిలవకపోయినా మూసేశారు పనులు చేస్తారో లేదో తెలియదు కానీ.. బ్రిడ్జిని మాత్రం మూసేశారు. రైతుల పాదయాత్ర రాజమండ్రి దాటిన తర్వాత తెరుస్తారు.
అయితే ఇవన్నీ చిల్లర చేష్టలని వైసీపీ నేతలు కూడా అనుకుంటున్నారు. బ్రిడ్జిని మూసివేసినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఆగిపోతుందా అని వారిలో వారు అనుకుంటున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రజల్లో చులకన అవుతామని.. అంతకు మించిన రాజకీయ ప్రయోజనం ఉండదని… నిట్టూరుస్తున్నారు. అయితే వైసీపీ పెద్దల ఆలోచనా ధోరణి.. అంతే … కురచగా ఉంటుందని ఇప్పటికే అనేక సార్లు వెల్లడయింది.