ఏపీ ప్రభుత్వానికి డబ్బులు వసూలుకు ఎక్కడ చాన్స్ దొరికితే చాలు అక్కడ పిండేసుకోవడానికి చిత్రవిచిత్రమైన ఐడియాలు వస్తూంటాయి. తాజాగా గణేష్ మండపాల విషయంలోనూ అదే జరుగుతోంది. వినాయకచవికి వీధి వీధినా మండపాలు ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటుచేసే మండపాల నుంచి డబ్బుల వసూళ్లు ప్రారంభించారు. ఎన్ని స్పీకర్స్ పెట్టుకుంటే అన్ని వందలు కట్టాలని… ఒక్కో మండపానికి రూ. వెయ్యి వరకూ ఫీజుచెల్లించాలని.. నిబంధనలు విధించారు. ఎలా చూసినా.. ఒక్కో మండపం నుంచి ఐదారు వేలు వివిధ రకాల ఫీజులతో వసూలు చేసేలా రూల్స్ పెట్టారు. వీటిని చూసి పందిళ్లు ఏర్పాట్లు చేద్దామనుకునేవారికి మైండ్ బ్లాంక్ అయింది.
గణేష్ ఉత్సవాలను అందరూ చందాలు వేసుకుని నిర్వహిస్తున్నారు. అలాంటి చందాల నుంచి ప్రభుత్వం కొంత వాటా తీసుకునే ప్రయత్నం చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. చివరికి బీజేపీ నేతలు కూడా ఈ అంశంలోకి రంగంలోకి దిగారు. ఇలా ఫీజులు వసూలు చేయడం కరెక్ట్ కాదని నేరుగా ప్రభుత్వానికే లేఖలు రాశారు. ఫీజులు వసూలు చేయటం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం హిందూ ధర్మంపై గౌరవం లేదని సోము వీర్రాజు అంటున్ారు. హిందువుల పండగలపై బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందన్నారు. పూజకు ఫీజులా ? అని ప్రశ్నించారు.
గతేడాది వినాయక చవితి ఉత్సవాలను కరోనా పేరుతో నిలువురించే ప్రయత్నం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. బీజేపీ ఆందోళనలతో దిగి వచ్చింది. మండపాలకు సింగల్ విండో సిస్టం ద్వారా, ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అనుమతులను వెంటనే మంజూరు చేయాలని బీజేపీ నేతలంటున్నారు. ప్రభుత్వం తీరు చూసి ప్రజలు కూడా అసహ్యంతో కూడిన జాలిని ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ప్రతీ దానికి డబ్బులు వసూలు చేయడం కట్టకపోతే బెదిరింపులకు పాల్పడటం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.