ఏపీ సర్కార్.. కోర్టులను లెక్క చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడానికి నిరాకరించింది. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్న సంప్రదాయేతర ఇందన విద్యుత్ కంపెనీలకు.. బకాయిలు చెల్లించాల్సిందేనని.. హైకోర్టు గడువు పెట్టి మరీ ఆదేశాలు జారీ చేసింది. కానీ.. ప్రభుత్వం మాత్రం.. చెల్లించలేదు. ఇదే విషయాన్ని చెబుతూ.. ఆయా కంపెనీలు మరోసారి హైకోర్టును ఆదేశించాయి. హైకోర్టు చెప్పినప్పటికీ.. తమకు బకాయిలు చెల్లించలేదని.. అదే సమయంలో విద్యుత్ కూడా కొనుగోలు చేయడం లేదని.. కోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై నెలాఖరులో విచారణ జరగనుంది.
సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సంస్థలతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్ని అవినీతి మయం అంటూ.. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార వేదికపై ప్రకటించారు. ఆరు వారాల్లో ఆవినీతిని ప్రజల ముందు ఉంచుతానని ప్రకటించారు. ఆ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేశారు. రేట్లు తగ్గించాల్సిందేనని.. ఆయా సంస్థల హుకుం జారీ చేశారు. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్లుగా సమాచారం పంపారు. కానీ.. ఆ సంస్థలు.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ..న్యాయపోరాటం చేస్తున్నాయి. కేంద్రం.. చాలా సార్లు హెచ్చరిక స్వరంతోనే ఏపీ సర్కార్ కు సూచనలు చేసింది. ఆ ఒప్పందాల్లో అవినీతి ఉంటే.. చూపించాలని.. లేకపోతే యథాతథంగా కొనసాగించాలని చెప్పింది. అయితే సీఎం మాత్రం.. అవినీతికి ఆధారాలు చూపించలేదు.. ఒప్పందాలను గౌరవించలేదు.
జగన్ విధానం వల్ల దేశంలో పెట్టుబడుల వాతావరణంపై ప్రభావం పడింది. ఏపీలో సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో అత్యధికం విదేశీ పెట్టుబడులే. వారి సెంటిమెంట్ దెబ్బతినడంతో… ఆ రంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయి. ప్రతిపాదనలు కూడా వెనక్కి పోయాయి. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లాంటి వాళ్లు… ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ..ఏపీ సీఎంను మాత్రం.. కన్విన్స్ చేయలేకపోయారు. ఇప్పుడు.. ఏపీ సీఎం ఈ విషయంలో కోర్టులను కూడా లెక్క చేయకూడదనుకుంటున్నట్లుగా తాజా పరిణామాలతో స్పష్టమవుతోందంటున్నారు.