రుషికొండను గుండు కొట్టేసి.. అక్కడ హోటల్ పేరుతో సీఎం క్యాంప్ ఆఫీస్ ను నిర్మించుకుంటారు. ఏవరైనా అడిగితే తప్పేంటి అంటూ తమకు మాత్రమే సాధ్యమైన తెలివితేటలతో ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ రుషికొండ బీచ్ ను కూడా పూర్తిగా ప్రైవేటు బీచ్ గా మార్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా బీచ్ లోకి ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. పదకొండో తేదీ నుంచి ఫీజులు వసూలు చేయబోతున్నారు.
సాగర తీర నగరమైన విశాఖలో ఇప్పటివరకు ఇలా ఎక్కడా బీచ్‌లలో టిక్కెట్లు పెట్టలేదు. ఆర్కే బీచ్‌వద్ద గానీ, భీమిలి బీచ్‌లో గానీ ఎక్కడా రుసుములు వసూలు చేయడం లేదు. రుషికొండ, తొట్లకొండ, అప్పికొండ ఎక్కడా ఇలాంటి నిబంధనలు లేవు. కానీ ప్రభుత్వం కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. రుషికొండను కేంద్ర ప్రభుత్వం ‘బ్లూ ఫ్లాగ్ బీచ్’గా గుర్తించడంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. వాటికి ఖర్చయిపోతున్నాయని..అందుకే చార్జీలని చెబుతోంది. కానీ కేంద్రం భ్లూ ఫాగ్ బీచ్‌లకు నిధులు ఇస్తోంది. అయినా ఖర్చుల కారణంగా చూపి అక్కడకు పర్యాటకులు రాకుండా చేయాలనుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
రుషికొండ పై కట్టిన నివాసం నుంచి బీచ్ లోకి వెళ్లి సేదదీరేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేుకుంటున్నారని గతంలో అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తూంటే..అలాగే ఉందని.. ముందు ముందు టిక్కెట్లు కొనేవారిని కూడా రానివ్వరన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగినా ఆశ్చర్యం లేదని టీడీపీ నేతలంటున్నారు.