ముఖ్యమంత్రి అంటే ఓ వ్యవస్థ. ఆయన వ్యక్తి కావొచ్చు కానీ.. విధి నిర్వహణలో ఆయనో వ్యవస్థ. రాష్ట్ర ప్రజలు పరిపాలించమని అధికారం ఇస్తారు. కేబినెట్ మంత్రులతో కలిసి పరిపాలిస్తారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అధికారులు అమలు చేయాలి. ఇది పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే అధికారులదే తప్పు. ఇప్పటి వరకూ మన అధికార వ్యవస్థ గురించి మనం తెలుసుకున్న పాఠం ఇది.. కానీ ఏపీలో దర్యాప్తు సంస్థలు… రాజకీయాలు ..దీనికి కొత్త అర్థం చెబుతున్నారు. ప్రతీ దానిి ముఖ్యమంత్రిదే తప్పంటున్నారు. జీవోలు జారీ చేసిన అధికారులు… క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన వారు.. డబ్బులు విడుదల చేసిన వారు.. ప్రాజెక్టును అమలు చేసినవారు అందరూ అమాయకులు ఒక్క ముఖ్యమంత్రిదే తప్పంటున్నారు.
స్కిల్ ప్రాజెక్టులోనూ… ఫైబర్ నెట్ ప్రాజెక్టులోనూ నిధుల దుర్వినియోగం జరిగిందో… లేకపోతే అవినీతి జరిగిందో దర్యాప్తు సంస్థలు చెప్పడం లేదు. కానీ చంద్రబాబును నిందితుడిగా చేర్చేశారు. ఆయన ఎలా నిందితుడు అంటే… కాంట్రాక్ట్ పొందిన కంపెనీ చంద్రబాబు సన్నిహితుడని వాదిస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు ఇలాంటివి బాగుంటాయి కానీ… న్యాయస్థానాల్లో ఎలా వాదిస్తారు అన్నది … వ్యవస్థపై కనీస అవగాహన ఉన్న వారికి ఆశ్చర్యం. కానీ అదే జరుగుతోంది. చంద్రబాబుకు ఎలా ప్రమేయం అనేదానికి చిన్న ఆధారం లేకుండానే అరెస్ట్ చేశారు. ఎందుకంటే కాంట్రాక్ట్ పొందిన వాళ్లు నిధులు దారి మళ్లించారట. ఎలా మళ్లించారో కూడా తెలియదు. ఇంకా దర్యాప్తు చేస్తున్నారట.. ఆ నిధుల మళ్లింపునకు చంద్రబాబుకు సంబంధం ఏమిటన్నది మాత్రం. చెప్పలేరు.
ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులోనూ అదే పరిస్థితి. నిజానికి ఆ ప్రాజెక్టు ఖర్చు వెయ్యి కోట్లుపైగానే ఉంటుంది. అంత ఖర్చు భరించలేక… వైర్లను కరెంట్ పోల్స్ మీదుగా వేయడం ద్వారా చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు. దీని వల్ల ప్రజలకు 149కే ఇంటర్నెట్ సహా కేబుల్ టీవీ సౌకర్యాలు అందాయి. ప్రభుత్వం వచ్చాక రేట్లను విపరీతంగా పెంచింది., అందులో రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని టీడీపీ నేతలు పత్రాలు విడుదల చేశారు. కేసు నమోదు చేసిన నాలుగేళ్ల తర్వాత చంద్రబాబును ఏ 25గా చేర్చి పీటీ వారెంట్ దాఖలు చేశారు. కళ్ల ముందు ఇది రాజకీయ కక్ష అని తెలిసిపోయేలా అన్ని వ్యవహారాలు ఉన్నాయి.
దేనికైనా ఓ పద్దతి ఉంటుంది. అవినీతి జరిగితే….. మనీ ఏ పద్దతిలో నిందితుడు అందుకున్నారో చూపించాలి. జగన్ రెడ్డి కేసుల్లో సీబీఐ … కొన్ని వేల కోట్లు ఎలా అందుకున్నారో కోర్టులకు చూపించాయి. అలా చూపించాల్సి ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా చూపించలేకపోతున్నా రు. సన్నిహితుడు.. అందాయి.. ఫైళ్లు పోయాయి… అంటూ ఊహాజనిత ఆరోపణలు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేస్తే… ఇక మన దేశంలో అధికారం కోల్పోయిన ప్రతి ఒక్క నేత జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే… అధికారం అందిన ఎవరూ… తాము చేతకాని వాళ్లమని … చేతులు కట్టుకుని కూర్చోరు. అంతకు అంత దెబ్బతీస్తారు. అదే మన ప్రజాస్వామ్యం అనుకోవాలేమో ?