ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018 నాటి మొదటి డీఏను జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించారు. జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జులై జీతాల్లో చెల్లిస్తారు. జులై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లిస్తారు. సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది.
అయితే ఆరు నెలల తేడాతో డీఎలు అమలు చేయడంతో.. ఆ తర్వాత ఇవ్వాల్సిన డీఎలను వాయిదా వేస్తారన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో ఏర్పడుతోంది. ఇవ్వాల్సిన డీఎలను ఇలా.. ఆరు నెలలకోసారి ఇస్తామని చెప్పడం ద్వారా.. కొత్తగా ఇవ్వాల్సిన డీఏలకు టెండర్ పెట్టేశారని విమర్శలు వినిపిస్తన్నాయి. పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒకే సారి అమలు చేస్తారని చాలా మంది ఉద్యోగులు ఆశించారు. కానీ ప్రభుత్వం ఎప్పట్లాగే కొత్తగా ఆలోచించింది.
కరోనా పేరుతో కత్తిరించిన జీతాలను కూడా ప్రభుత్వం ఇచ్చుకుంటూ పోవాలని నిర్ణయించింది. రెండు నెలల పాటు సగం సగం జీత కోత విధించిన దాన్ని ఐదు విడుతలుగా ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్ నుంచే వాయిదా జీతాలు చెల్లిస్తామని ప్రకటించించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ జీతం చెల్లిస్తారు. డీఏలను 2022 వరకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పుడు జీతాలను ఐదు నెలల పాటు ఇచ్చుకుంటూ పోవాలని నిర్ణయించుకుంది.