ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ గతంలో చేసిన ఆరోపణలకు.. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలకు సారూప్యత ఉండటం లేదు. అధికారం చేపట్టిన మొదట్లో తీసుకున్న నిర్ణయాలకు.. ఏడాది తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలకూ అసలు పోలికే ఉండటం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కంపెనీలపై భారీ ఆరోపణలు చేశారో.. అవినీతి ఆరోపణలు చేశారో.. ఆ పనులను తాము ప్రభుత్వంలోకి రాగానే రద్దు చేశారో.. ఏడాది తర్వాత మళ్లీ ఆ కంపెనీలకే పనులు అప్పగించేస్తున్నారు. ఆయా సంస్థల ప్రతిపాదనలను అంగీకిస్తున్నారు. గ్రీన్కో, జీఎంఆర్ సంస్థలతో ప్రభుత్వం మళ్లీ ఒప్పందాలు కుదుర్చుకోవడం ఈ నిర్ణయాల్లో ఓ భాగంగా మారింది.
గ్రీన్కో సంస్థతో పదిహేను వందల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలను కొనసాగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కానీ.. ఈ సంస్థ విషయంలో ఏపీ సర్కార్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాగానే పీపీఏలను రద్దు చేసింది. అందులో ఈ గ్రీన్ కో సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ కోర్టుకెళ్లింది. న్యాయపోరాటం చేస్తోంది. మధ్యలో కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం.. సీఎం జగన్‌కు చెక్ ఇచ్చేందుకు.. ఆ సంస్థ ప్రతినిధులు కలిసిన ఫోటోలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏం జరిగిందో కానీ.. గ్రీన్ కో సంస్థతో ఒప్పందం కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. కేబినెట్లో కూడా చర్చించారు. పరిహారం.. ఎకరానికి రెండున్నర నుంచి ఐదు లక్షలకు పెంచామని.. మరో ప్రయోజనం పొందామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. అసలు చేసిన ఆరోపణలు వీటికి సంబంధించినవి కావు.
ఇక బోగాపురం ఎయిర్ పోర్టు విషయంలోనూ అంతే. గతంలో.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాకు ఇవ్వకుండా.. జీఎంఆర్‌కు ఇచ్చేందుకు చంద్రబాబు కుట్ర చేశారని.. భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు అదే జీఎంఆర్‌కు ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతను అప్పగించింది. ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మరి గతంలో చేసిన ఆరోపణలు ఏమయ్యాయి.. అంటే… గతంలో కంటే.. రెండు వందల యాభై ఏకరాలు తక్కువగా జీఎంఆర్‌కు ఇస్తున్నందున పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరి గతంలో చేసిన ఆరోపణలు మౌలికంగా ఇవి కాదుగా..? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. నిన్నటికి నిన్న జీఎంఆర్‌తో ఒప్పందం జీవోను ఇచ్చిన ప్రభుత్వం.. దాన్ని కాన్ఫిడెన్షియల్‌లో పెట్టడం.