ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తే స్కూళ్లకు సెలవు ఇస్తారా? అలాంటి సంప్రదాయం ఎక్కడైనా చూశామా ? అసలు ప్రధాని రాష్ట్ర పర్యటనకు వెళ్లడానిక స్కూళ్లకు సెలవులివ్వడానికి ఏమైనా లింక్ ఉందా? బుర్రలు బద్దలు కొట్టుకున్నా.. లింక్ మనకు అర్థం కాదు. కానీ ఏపీ ప్రభుత్వానికి మాత్రం లింక్ ఉంది.. ఉంటుంది.. ఖచ్చితంగా ఉంటుందని అనిపించింది. అందుకే ప్రధాని మోదీ ఏపీకి వచ్చే రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించేశారు.
జూలై నాలుగో తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు భీమవరం వస్తున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆ రోజు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి స్కూళ్లు ఆ రోజే ప్రారంభం అవుతున్నాయి. ప్రతీ ఏటా జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే స్కూళ్లను ఈ సారి జూలైలో ప్రారంభించాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు ప్రారంభమయ్యాయి.కానీ ఏపీలో మాత్రం వచ్చే నెల నాలుగో తేదీకి ముహుర్తం పెట్టారు. ఇదే ఆలస్యం అనుకుంటే ఆ రోజు ప్రధాని మోదీ వస్తున్నారని ఆ రోజు సెలవు ఇచ్చేశారు. జూలై ఐదో తేదీనుంచి స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు.
అసలే ఏపీలో విద్యావ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉందన్న ప్రచారం జరుగుతూండగా.. ఇప్పుడు స్కూళ్ల సీజన్ నెల రోజుల పాటు వాయిదా వేయడమే కాకుండా.. మోదీ వస్తున్నారని.. సెలువు ప్రకటించడం తల్లిదండ్రుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. మోదీ వచ్చినా అసలు స్కూళ్లకు ఆటంకం ఏముందని.. ఎవరిపని వారు చేసుకుంటారని.. ఎందుకీ వాయిదా అనే డౌట్ ఎక్కువ మందికి వస్తోంది. కానీ ఏపీలో అంతే అని సర్దుకోవాల్సిందేనని నిట్టూరుస్తున్నారు.