సీఆర్డీఏను రద్దు చేసి.. మళ్లీ వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు జోరుగా ఆ సంస్థతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. హ్యాపీనెస్ట్ లాంటి ప్రాజెక్టును పక్కన పెట్టేసి..కోర్టు కేసులు ఎదుర్కోవడానికి కూడా రెడీ అన్నట్లుగా ఉన్న ప్రభుత్వం… ఇప్పుడు సీఆర్డీఏతో స్థలాలను అమ్మాలని నిర్ణయించింది. దీనికి స్మార్ట్ టౌన్షిప్ పథకం అని పేరు పెట్టారు. మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం సమీపంలోని అమరావతి టౌన్షిప్ పేరుతో 600 వరకు ప్లాట్లను అమ్మకానికి పెట్టారు.
ఒక్కొక్కటి 200 చ.గజాల నుంచి 240 చ.గజాల వరకు ఉంటుంది. కుటుంబ సభ్యుల అందరి ఆదాయం సంవత్సరానికి రూ.18 లక్షల లోపు ఉండి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఇక్కడ కొనుగోలు చేయాలి. ఆదాయాన్ని ధ్రువీకరించే ఐటీ రిటర్నులు, ఫారం16, తహశీల్దారు జారీ చేసిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో విలువలో 10 శాతం చెల్లించాలి. కేటాయింపు అయిన నెలలోపే ఒప్పందం చేసుకోవాలి… ఆ తర్వాత నెలలోగా 30 శాతం, 6 నెలలకు మరో 30 శాతం, ఏడాదికి కానీ.. రిజిస్ట్రేషన్ సమయంలో కాని మిగిలిన 30 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది.
ధర ఎంత అన్నది ఫైనల్ చేయలేదు. ఎలా ఫైనల్ చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ఈ టౌన్ షిప్ ప్రాజెక్టును పదమూడో తేదీన జగన్ ప్రారంభిస్తారు. ఇది నేరుగా ప్రభుత్వ స్థలాల అమ్మకం అని.. బిల్డ్ ఏపీ రూపు మార్చి ఇలా చేస్తున్నారని విపక్షాలంటున్నాయి. అయితే అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయని వైసీపీ స్థలాలను ఎలా అమ్ముతుందని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.