రాజధాని భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ తన ట్వీటర్ ద్వారా చేస్తున్న హెచ్చరికలకు ఏపీ ప్రభుత్వం కూడా చురుకుగానే స్పందిస్తోంది. ఆయన మా మిత్రుడేనని చెపుతూనే భూసేకరణ వ్యవహారంలో మాత్రం ఆయన్ని పట్టించుకోబోమని స్పష్టం చేస్తున్నట్లుగా ముందుకు సాగుతోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిన్న చేసిన ప్రకటనే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ మా మిత్రుడే. ఆయనతో మాకు ఎటువంటి విభేదాలు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లోనే రైతుల నుంచి 2,200 ఎకరాల భూమిని సేకరించేందుకు భూసేకరణ చట్టం క్రింద నోటీసులు ఇవ్వవలసి వస్తోంది. తుళ్ళూరు మండలంలో 700 ఎకరాలను సేకరించేందుకు శుక్రవారంనాడు కొందరు రైతులకి నోటీసులు ఇవ్వబోతున్నాము. మిగిలిన 1500 ఎకరాల భూసేకరణ కోసం మళ్ళీ ఐదు రోజుల తరువాత నోటీసులు ఇస్తాము. లేకుంటే రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడం కష్టం అవుతుంది,” అని చెప్పారు.
కనుక పవన్ కళ్యాణ్ హెచ్చరికలు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరించలేకపోయాయని అర్ధమవుతోంది. అంతే కాదు పవన్ కళ్యాణ్ తన పరిధిలో ఉన్నంతవరకే ఆయన మాటలను గౌరవిస్తామని దాటితే పట్టించుకొబోమని స్పష్టంగా చెప్పినట్లే భావించవచ్చును. త్వరలోనే తను పెనుమాక, ఉండవల్లి, బేతపూడి తదితర నదీ పరివాహక గ్రామాలలో పర్యటించి రైతులను కలుస్తానని పవన్ కళ్యాణ్ నిన్ననే ట్వీట్ చేసారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా ముందుకు వెళితే రైతులతో కలిసి భూసేకరణకు వ్యతిరేకిస్తూ పోరాడుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లే భావించవచ్చును. ఒకవేళ ఆయన రంగంలోకి దిగేందుకు సిద్దపడితే సమస్య మరింత జటిలంగా మారడం తధ్యం. కనుక ప్రభుత్వం ఆయనని ఏవిధంగా నియంత్రిస్తుందో, అప్పుడు ఆయన రంగంలో దిగుతారో లేదో చూడాలి.