ఆంధ్రప్రదేశ్లో వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వ ఆంక్షల వివాదం ముదురుతోంది. మండపాలు బహిరంగ ప్రదేశాల్లో వద్దని ఇళ్లలో మాత్రమే పండుగ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీల వ్యవహారాలకు పెద్ద ఎత్తున చేస్తున్న వైసీపీ, ప్రభుత్వం పండుగలకు మాత్రమే ఎందుకు ఈ ఆంక్షలు పెడుతున్నారనేది చర్చనీయాంశం అయింది. కోవిడ్ రూల్స్ ప్రకారం పండుగ నిర్వహించుకునేలా రూల్స్ మార్చి గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు, సూచనలు వెళ్తున్నాయి. ఒక వేళ ప్రభుత్వం తక్షణం రూల్స్ మార్చుకోకపోతే పండుగను బహిరంగంగానే నిర్వహిస్తామని ఏం చేస్తారో చేసుకోవాలని కొంత మంది సవాల్ చేస్తున్నారు.
ప్రజల్లో ఉన్న స్పందనను చూసి రాజకీయ పార్టీలు మరింత దూకుడుగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నేతలు గవర్నర్ ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఇక ప్రజలు వివిధ కాలనీల కమిటీలతో కలిసి మండపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించడం ఖాయంగా కనిపిస్తోంది. పలు చోట్ల వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు అధికారికంగా లేఖ రాస్తున్నారు. సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాసిన లేఖ ఇప్పటికే వైరల్ అయింది. చిత్తూరు జిల్లాలో ఓ ట్రైనీ ఎస్ఐ మండపాలకు అనుమతి ఇస్తే ఉన్నతాధికారులు ఆ ట్రైనీ ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ హిందువుల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతున్నాయి.
మరో వైపు అధికారుల ఓవరాక్షన్ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం అవుతోంది. విగ్రహాల తయారీదారులు లక్షలు అప్పు తెచ్చి విగ్రహాలు తయారు చేశారు. పండుగకు వారం ముందు మండపాలు లేవని ప్రకటించారు. ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్న కారణంతో కొన్ని చోట్ల మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపారు. అమ్మకాలకు పెట్టిన విగ్రహాలను తరలించే ప్రయత్నం చేశారు. విగ్రహ తయారీదారులు మాత్రం తాము బయటపడాలంటే… అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ప్రభుత్వం వేడుకలకు అనుమతి ఇవ్వాల్సిందేనని అంటున్నారు.
తా అన్ని రాష్ట్రాల్లోనూ బహిరంగ మండపాలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తూ జరుపుకోవాలని అనుమతులు ఇచ్చాయి. అయితే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఆంక్షలు విధించామంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పండుగ మరో రెండు రోజుల్లో ఉన్నందున ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందో లేదో కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా పండుగను మండపాల్లో నిర్వహించుకోవాలని అనుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు.