ఓటీఎస్ కింద పేదల దగ్గర రూ. పది వేలు.. పట్టణ ప్రాంతాల్లో రూ. ఇరవై వేలు వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటిని కట్టలేకపోతున్న పేదల్ని వదిలి పెట్టడం లేదు. అయితే అప్పు ఇస్తాం.. అంటోంది…లేకపోతే వాయిదాల పద్దతిలో కట్టుకోమని సలహాలిస్తోంది. ఈ మేరకు కేబినెట్లోనూ నిర్ణయం తీసుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా..అసలు ఓటీఎస్ వసూలు చేసేందుకు సిబ్బంది పేదల ఇళ్లపైకి వెళ్తున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణం అవుతోంది. ఇటీవల ఓటీఎస్ విషయంలో వరుసగా వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ వీడియోల్లో డబ్బులు ఎక్కడ కడతామని పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం పక్కన పెడితే.. అసలు డబ్బు వసూలు చేయడానికి కనీసం పది మంది వెళ్లడమే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు.. చివరికి మహిళా పోలీసును కూడా తీసుకెళ్తున్నారు. వడ్డీ వ్యాపారుల తరహాలో పేదలను వేధిస్తున్నారు. ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. ఎంత చెప్పినా ఇవ్వకపోతే.. మళ్లీ వస్తాం.. ఇలాంటి వేధింపులే ఉంటాయి.. డబ్బు రెడీ చేసుకోమని చెప్పి వెళ్తున్నారు. ఈ తరహా డబ్బుల వసూలు ప్రక్రియ నిరుపేదల్ని సైతం తీవ్ర అవమానాలకు గురయ్యేలా చేస్తోంది.
ఎప్పుడో ఇరవై ఏళ్ల కింద ఇచ్చి.. పట్టించుకోని రుణాలకూ ఇప్పుడు ఇలా వసూళ్లు చేయడం కాకుండా.. పది మందికిపైగా ఇంటిపైకి పంపడం ఏమిటన్న చర్చ.. ఆ గ్రామం మొత్తం సాగుతోంది.నిజానికి ఓటీఎస్ స్వచ్చందమని సీఎం జగన్ చెప్పారు. దీంతో చాలా మంది తమ దగ్గర డబ్బుల్లేవంటున్నారు. కానీ స్వచ్చందం కాదు నిర్బంధమని ఇలా పది మందికిపైగా పేదల ఇళ్ల మీదకు వెళ్లి రచ్చ చేస్తున్నారు. నిరుపేదల్ని ఇంత దారుణంగా పీడించి డబ్బు వసూలు చేసి ప్రభుత్వం ఏం సాధిస్తుందన్న చర్చ వైసీపీ నేతల్లోనే సాగుతోంది. ఇలాంటి వీడియోలు.. ఇలా డబ్బులు వసూలు చేసే పద్దతి ప్రభుత్వ పరువు తీస్తోందని గగ్గోలు పెడుతున్నారు. కానీ వినిపించుకునే పరిస్థితిలేదు.