ప్రీతి సుడాన్. ఈ ఐఏఎస్ అధికారి పేరు గత ఏడాది మార్మోగిపోయింది. కోవిడ్ లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తరపున చురుకుగా వ్యవహరించిన టాప్ త్రీ అధికారుల్లో ఈమె ఒకరు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమె రిటైర్మెంట్ గడువును పెంచి మరీ.. సేవలను వినియోగించుకున్నారు. అలాంటి ఈ అధికారిణిపై ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఎప్పుడో పదిహేడేళ్ల కిందట స్టడీటూర్ పేరుతో వ్యక్తిగత పర్యటనకు అమెరికా వెళ్లారని.. ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఈ నోటీసులు జారీ చేశారు. ఇంత హఠాత్తుగా రిటైరైపోయిన ప్రీతీ సూడాన్ పై ఏపీ ప్రభుత్వానికి ఎందుకు కోపం వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రీతి సూడాన్ ఏపీ క్యాడర్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల్లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఎక్కువ కాలం కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు.
ఇటీవల ఆమె రిటైరయ్యారు కూడా. అమె సర్వీస్ రికార్డు మొత్తం డీవోపోటీ వద్ద ఉంటుంది. చర్యలు ఏమైనా ఉంటే.. డీవోపీటీ లేకపోతే…సర్వీస్ చేసిన కేంద్రం చూసుకుంటుంది. అయితే పదిహేడేళ్ల క్రితం.. ఉమ్మడి ఏపీలో పని చేసినప్పుడు… ఆమె అమెరికా పర్యటనకు వెళ్లారని.. స్టడీ టూర్ పేరుతో వ్యక్తిగత పర్యటనకు వెళ్లారని ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఆమె ఇప్పటికే రిటైరైపోయారు. సర్వీసు పరంగా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేరు. అదంతా ఓకే కానీ.. అసలు పదిహేడేళ్ల తర్వాత ఎందుకు ప్రభుత్వం ప్రీతి సూడాన్ పై పగబట్టినట్లుగా వ్యవహరిస్తుందన్నదే అధికారవర్గాల్లో సైతం చర్చనీయాంశం అవుతోంది. ఆమె తప్పు చేసి ఉంటే.. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.
ఇంకా చెప్పాలంటే… ప్రభుత్వం చెబుతున్న 2005-06 సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారన్నది కీలకమైన విషయం. అప్పట్లో చెప్పిన పనులు చేయలేదనో.. లేకపోతే… ప్రస్తుతం క్యాడర్ అధికారులతో ఉన్న వివాదాల వల్లనో.. ఈ తరహా క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు వచ్చాయన్న అనుమానాలు ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇష్టం లేని అధికారులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశం లేకపోయినా సృష్టించుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంటుందని మరోసారి స్పష్టమయిందంటున్నారు.