ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ ఒకటో తేదీ నుంచి పర్మినెంట్ చేసిన జీతాలు ఇస్తామని జగన్ ప్రకటిచారు. మే వచ్చేసింది. కానీ ఇంత వరకూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు అయినట్లుగా కానీ.. అందుకోసం ఏమైనా చర్యలు తీసుకున్నారన్న అంశఁపై కానీ స్పష్టత లేదు. జూన్ ఒకటో తేదీ నుంచి పెరిగిన జీతం రావాలంటే … మేలోనే వారికి ప్రొబేషన్ ఖరారు చేయాలి. జూన్‌లో ప్రొబేషన్ ఖరారు చేస్తే పెరిగిన జీతం జూలైలో వస్తుంది.
గత ఏడాది అక్టోబర్‌కే ప్రొబేషన్ ఖరారు కావాల్సి ఉన్నా ప్రభుత్వం పరీక్షలు అని. ..మరొకటని వాయిదా వేస్తూ వస్తోంది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు. వారితో చివరికి సులభ్ కాంప్లెక్స్‌ల దగ్గర చిల్లర వసూలు చేయడం వంటి పనులు కూడా చేయిస్తున్నారు. మూడు సార్లు హాజరు వేయించుకోవడం వంటి చర్యల ద్వారా వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. పొమ్మనకుండా పొగపెడుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కూడా ప్రొబేషన్ ఖరారు చేయకపోతే ఇక ముందు కూడా కష్టమన్న అభిప్రాయంతో ఉద్యోగులు ఉన్నారు.
ఇప్పటికే వారికి పే స్కేలు తక్కువగా నిర్ధారించారు. మంచి మంచి ఉద్యోగాలు వదులుకుని వచ్చిన తమను ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రొబేషన్ ఖరారు చేయాలని కోరుతున్నారు. అలా కాకుండా పరీక్షల పేరుతో ఇంకా ఇబ్బంది పెడితే.. సచివాయ ఉద్యోగులు రోడ్డెక్కే ప్రమాదం పొంచి ఉంది.