తెలుగు బాషా దినోత్సవాన్ని.. తెలుగు వాళ్లంతా.. సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. ఏ దేశంలో ఉన్నా.. తెలుగు భాష గొప్పదనాన్ని .. తెలుగు మాటల్లోనే… బయట పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అధికారికంగా… ప్రభుత్వం… తెలుగుతల్లిని ఒక్కటంటే.. ఒక్క పూలదండతోనూ… గౌరవించలేకపోయారు. ప్రభుత్వం తరపున ఏ ఒక్కరికీ.. తీరిక లేకుండా పోయింది. కనీసం పట్టించుకోలేదు. విజయవాడలో ఉన్న తెలుగు తల్లి విగ్రహం … తెలుగుభాషా దినోత్సవం రోజన కూడా… పూలమాలకు నోచుకోలేదు. ప్రతీ ఏటా… తెలుగుతల్లి విగ్రహం వద్ద పండుగ వాతావరణం ఉండేది. ఈ సారి నిర్మానుష్యంగా కనిపించింది.
తెలుగుతల్లి విగ్రహం సమీపంలోనే ఆధికార భాషాసంఘం, రాష్ట్ర భాషా సాంస్కృతిక ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అక్కడకు చాలా మంది వచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కలెక్టర్, ఎమ్మెల్యే, పోలీసు కమిషనర్ లాంటి వారు కూడా వచ్చారు. కానీ ఎవరూ.. తెలుగు భాషా దినోత్సవమని.. తెలుగు తల్లిని గౌరవిద్దామనే ఆలోచన చేయలేదు. కొద్ది రోజుల క్రితం… ఆంధ్రప్రదేశ్ సర్కార్… యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అనే.. పండితుడ్ని… అధికార భాషా సంఘం చైర్మన్గా నియమించింది. ఆయన గత వారం… ఘనంగా.. బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో తెలుగు గొప్పదనాన్ని గొప్పగా పొగిడారు. కానీ… తెలుగంటే.. ఆయనే అనుకున్నారేమో కానీ.. తెలుగు తల్లిని మాత్రం మర్చిపోయారు.
కొసమెరుపేమిటంటే… యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచి .. తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడానికి రూ. 18 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు మంజూరు చేశారు. కానీ.. రాష్ట్రంలో ఎక్కడా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించలేదు. ఆ రూ. పద్దెనిమిది లక్షలు ఏమయ్యాయనేది.. మరో ప్రశ్నగా మారింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. తన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఇదే ప్రశ్న వేశారు.