రైతులకు ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెడుతున్న విషయాన్ని …తక్కువ చేసి చూపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ముఖ్యనేతలంతా అనేక రకాల విన్యాసాలు చేస్తున్నారు. వైఎస్ ప్రవేశ పెట్టిన పథకానికి ఆయన..వర్థంతి రోజే.. జగన్ చెక్ పెట్టేశారని తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో… కవర్ చేయడానికి సలహాదారు కల్లాం అజేయరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఆయన తనదైన వాదన వినిపించారు. అసలు విషయం కన్నా.. ఎప్పుడో.. 1997లో ఏం జరిగిందో చెప్పడానికి ప్రాథాన్యం ఇచ్చారు కానీ..అంతిమంగా ఆయన చెప్పిన విషయం మాత్రం.. విద్యుత్ విషయంలో వైఎస్ఆర్ చేపట్టిన సంస్కరణలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని..అందుకే ఉచిత విద్ుయత్ కు బదులు నగదు బదిలీని ప్రవేశ పెడుతున్నారట.
కల్లాం అజేయరెడ్డి వాదన.. అందరిలోనూ మరిన్ని సందేహాలు ప్రారంభమవడానికి కారణంగా నిలుస్తోంది. ఎందుకంటే… వ్యవసాయమోటార్లకు మీటర్లు ఉండకూడదని.. ఉచిత విద్యుత్ ఇవ్వాలని… ఓ ఉద్యమ బ్రాండ్‌గా చేసుకుని వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారు. ఆయన అశయాలను కాదని… కేంద్రం ఆదేశించిందన్న పేరుతో.. వ్యవసాయ మోటార్లకు… స్మార్ట్ మీటర్లను బిగించడం..వైఎస్ఆర్ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం అని.. కల్లా అజేయరెడ్డి చెబుతున్నారు. అలాగే… ఉచిత విద్యుత్ కు బదులు.. ఆ బిల్లు మొత్తంలో నగదు ముందుగా రైతుల ఖాతాలకు జమ చేస్తారని..వాటిని తీసుకుని రైతులు బిల్లులు కట్టాలని చెబుతున్నారు. ఒక వేళ ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఎదురై.. డబ్బులు జమ చేయకపోతే… రైతు ఖాతాలో ఆ రుణం కనిపిస్తుంది. దీన్ని కూడా సంస్కరణగానే కల్లాం అజేయరెడ్డి చెబుతున్నారు.
ఇక ఏపీ విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ తప్పేం లేదని.. అంతా.. కేంద్రం తప్పేనని చెప్పడం ప్రారంభించారు. వ్యవసాయ మోటర్లకు స్మార్టు మీటర్లు పెట్టాలని కేంద్ర ఆదేశించిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని బాలినేని చెబుతున్నారు. నమ్మరేమో అనుకున్నారేమో కానీ.. రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్ పథకాన్ని మార్చి రైతులకు టెన్షన్ గురి చేయకుండా.. అదే ఉంచితే పోయేదానికి … సంస్కరణలు..సవాళ్లు చేస్తూ..వైసీపీ నేతలు రైతుల్ని మరింతగా గందరగోళానికి గురి చేస్తున్నారు.