నాలుగు రోజుల కిందటే మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో కొత్త జిల్లాల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. కానీ నాలుగో రోజున హఠాత్తుగా మళ్లీ ఆన్ లైన్ పద్దతిలో కేబినెట్ భేటీ నిర్వహించారు. మంత్రులందరూ జిల్లాల్లో ఉంటారు.. అమరావతి రాలేరు కాబట్టి హుటాహుటిన ఆన్ లైన్ సమావేశం ఏర్పాటు చేసి.. రెవిన్యూ మంత్రి ధర్మానతో కొత్త జిల్లాల ప్రతిపాదన పెట్టారు. వెంటనే ఆమోదించారు. ఇప్పుడు జిల్లాల విభజన చేయకపోతే.. వెంటనే అడ్డంకులు వచ్చేస్తాయి.. ఇప్పుడు చేయలేకపోతే.. ఇంకెప్పుడూ చేయలేమన్నట్లుగా నిర్ణయం తీసేసుకున్నారు. మీడియాకు కావాల్సిన సమాచారం లీక్ ఇచ్చారు.
ఈ మూడు రోజుల్లో ఏం మారింది ? కొత్త జిల్లాలు ఎందుకు చర్చకు వచ్చాయి..? అంటే.. ఒకటే సమాధానం. ప్రస్తుతం నడుస్తున్న ఉద్యోగుల ఉద్యమం నుంచి అందరి దృష్టి మళ్లించడం. ఉద్యోగులకు కూడా కొత్త జిల్లాలు పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. కొత్త జిల్లాల కారణంగా తెలంగాణలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కారు. సీనియర్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో వారుకూడా కొత్త జిల్లాలు లాభమా.. నష్టమా అనే చర్చల్లోకి వెళ్లిపోతారు.
ఇక సోషల్ మీడియాలో ఎలాగూ మా జిల్లా.. మాజిల్లా అంటూ అవసరం లేని చర్చలు జరుగుతాయి. దీనిపై ఫోకస్ పెరుగుతుంది. ఉద్యోగుల ఆవేదన వెనక్కి తగ్గిపోతుంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కోరుకున్నది ఇదే. ఉద్యోగుల వేదనపై వాలంటీర్లతో డోర్ టు డోర్ చేస్తున్న ప్రచారం వర్కవుట్ అవుతున్న సూచనలు కనిపించకపోవడంతోనే ఈ వ్యూహం పన్నినట్లుగా భావిస్తున్నారు.
నిజానికి కొత్త జిల్లాల విభజన అంత తేలిక కాదు. ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారనే కానీ ఇప్పటి వరకూ మౌలిక సదుపాయాలను కల్పించుకోలేకపోయారు. ఆ జిల్లాల వలన వస్తున్న సమస్యలతో ఇప్పటి వరకూ ఉద్యోగాలనూ భర్తీ చేయలేకపోతున్నారు. కొత్త జిల్లాల పేరుతో సరైన కసరత్తు లేకుండా ప్రజల భాగస్వామ్యం లేకుండా పని ప్రారంభిస్తే అయ్యేది రచ్చే. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. దాని కోసమే.. చేస్తున్నారు కాబట్టి అసలు పట్టించుకోరు. ఇక ఏపీలో సమస్య.. సమస్యను మించిన సమస్యను చర్చించుకోవడమే మిగిలింది.