గత మూడేళ్ల నుంచి ఏపీ ప్రభుత్వం.. అక్కడి పోలీసుల వర్కింగ్ స్టైల్ వేరు. ఎవరిపైనైనా ఫిర్యాదు వచ్చినట్లుగా కూడా తెలియదు.. ఎఫ్ఐఆర్ నమోదయింది లేనిది కూడా తెలియదు.. ఎవరినైనా వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోవడమే. అది ఎంపీ అయినా .. సామాన్యుడయినా పెద్ద తేడా లేదు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అయితే అటూ ఇటూ చూసే పనికూడా లేదు. అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చిన ఘటనలు కోకొల్లలు. అయితే ఇప్పుడు ఎందుకోని రఘురామ విషయంలో పరువు నష్టం దావా వేస్తున్నామని ప్రజాస్వామ్య మాటలు చెబుతున్నారు.
లిక్కర్ బ్రాండ్ల విషయంలో రఘురామ కృష్ణరాజు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రజత్ భార్గవ ఆరోపించి ఆయనపై పరువు నష్టం దావా వేస్తున్నామని ప్రకటించారు. గతంలో రఘురామ హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్ లో ఏపీ మద్యం టెస్టులు చేయించి ఆ రిపోర్టుల్ని మీడియాకు ఇచ్చారు. వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఆ రిపోర్టుల్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఆ ల్యాబ్ నుంచే ఓ లేఖ తీసుకొచ్చింది. పరీక్షించిన శాంపిల్స్ ఏపీ నుంచి తెచ్చినవనేదానికి ఆధారాలు లేవని.. ఎక్సైజ్ చట్టం ప్రకారం టెస్టులు చేయలేదని.. రఘురామ అడగకపోవడంతో ప్రమాణాల ప్రకారం టెస్టులు చేయలేదని ల్యాబ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఆ లేఖను రజత్ భార్గవ మీడియాకు విడుదల చేశారు. అదే సమయంలో హైడ్రాక్సైడ్ ఉండటమే ప్రమాదకరం కాదని, కొన్ని హైరెసల్యూషన్ పరీక్షల్లో మంచి నీళ్లు కూడా తాగటానికి హానికరం అని వస్తాయని రజత్ భార్గవ చెప్పుకొచ్చారు. రఘురామ కూడా అదే చెప్పారు.
రఘురామ శాంపిల్స్ ను మరోసారి చెన్నై ల్యాబ్‌కు పంపించారు. ఈ పరిస్థితుల్లో కంగారు పడిన ప్రభుత్వం.. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరికలు చేస్తోంది. రఘురామకృష్ణరాజు గతంలో ఈ నివేదిక విడుదల చేసినప్పుడే ఏపీబీసీఎల్ నోటీసులు పంపింది. ఇప్పుడు పరువునష్టం దావాకు సిద్ధమయింది. ఏదో ఓ ద్రోహం కేసులు పెట్టి రాత్రికిరాత్రి అరెస్ట్ చేయకుండా ఇలా పరువు నష్టం కేసులు వేయడం ఏమిటన్న చర్చ ఇప్పుడు రఘురామ వర్గీయుల్లో ప్రారంభమయింది.